AIYF leaders | కోల్ సిటీ, ఆగస్టు 25: గోదావరిఖని ప్రభుత్వ దవాఖాన వద్ద మూడు గుంటల స్థలంలో మాజీ కార్పొరేటర్ ఒకరు అక్రమ నిర్మాణం చేపడుతుంటే నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని, ఆ మాజీ ప్రజాప్రతినిధి నగరంలో ఏం చేసినా చెల్లుతుందా అని, ఒకవైపు అభివృద్ధి పేరిట భవనాలు కూలుస్తూనే మరోవైపు ఖాళీ స్థలాలను కబ్జా చేసి రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య ఆరోపించారు.
ఈమేరకు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద జరుగుతున్న అక్రమ నిర్మాణాలను సోమవారం సందర్శించి కార్పొరేషన్ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ నర్సరీ స్థలంలోని మూడు గుంటల స్థలంను కార్పొరేషన్ మాజీ ప్రజాప్రతినిధి ఆక్రమించి మూడు రోజులుగా అక్రమంగా భవన నిర్మాణం చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డు చెప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సదరు మాజీ కార్పొరేటర్ కు బినామీలుగా కార్పొరేషన్ అధికారులు పని చేస్తున్నారని ఆరోపించారు. పారిశ్రామిక ప్రాంతంలో అనుమతులు లేని భవనాలను సదరు మాజీ కార్పొరేటర్ చెప్పడంతోనే అధికారులు వెళ్లి ఆగమేఘాల మీద కూల్చివేస్తున్నారనీ, అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెడుతూనే మరోవైపు ఆ నాయకులే అధికారం అడ్డు పెట్టుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టడం బాధాకరమన్నారు.
కార్పొరేషన్లోని టౌన్ ప్లానింగ్ విభాగం పూర్తిగా అవినీతిమయంగా మారిందనీ, ఉన్నవారికి ఒక చట్టం, లేనివారికి ఇంకో చట్టం అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి, కలెక్టర్ జోక్యం చేసుకొని ఈ అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రజల్లో నమ్మకంను కాపాడుకోవాలని కోరారు. అంతేగాక అక్రమ నిర్మాణం చేపట్టిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు తాళ్లపల్లి సురేందర్, ఆసాల నవీన్ తదితరులు పాల్గొన్నారు.