Vemulawada | రుద్రంగి, మే 30: పంటల సాగులో ఆది నుంచీ అన్నదాతలకు ఇబ్బందులు పరిపాటిగా మారాయి. నీటి ఎద్దడితో పంటను కాపాడుకున్న కర్షకుల శ్రమకు చివరిలో కోత పడుతోంది. అకాల వర్షాలకు ధాన్యం మొలకెత్తుతోంది. మరోవైపు అటవీప్రాంతంలో ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పలపై వన్యప్రాణులు నిత్యం దాడులు చేస్తూ అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.
అడవిపందుల దాడులతో దిక్కుతోచని దుస్థితి ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టినా ధాన్యం కుప్పలను అడవి పందులు దాడి చేసి ధ్వంసం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్ కవర్లను ఇష్టారీతిన చించి పడేసి ధాన్యాన్ని చిందరవందర చేసి నష్టం చేశాయని అన్నారు.
మొన్నటివరకు అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైందని, ఇప్పుడు అడవి పందులతో ధాన్యం ధ్వంసమమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లను వేగవంతం చేసి అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ధాన్యాన్ని త్వరగా కొనుగొలు చేయాలని కోరారు.