మంథని, జూలై 3 : మంథనిలో రింగ్ రోడ్డు పేరుతో రూ.300 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కనే రింగ్ రోడ్డు నిర్మిస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగంగా ఉంటుందో మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ప్రశ్నించారు. మంథనిలోని కూచీరాజ్పల్లి మైనార్టీ గురుకుల పాఠశాల/కళాశాల సమీపంలో ఇటీవల రింగ్ రోడ్డుకు భూమి పూజ జరిగిన ప్రాంతానికి గురువారం వెళ్లారు. నేషనల్ హైవే, రింగ్ రోడ్డు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయనే విషయాలను వివరించారు. ఆనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూచీరాజ్ పల్లి సమీపంలో మంథనికి చెందిన సీఎల్ రాజం రియల్ ఎస్టేట్ భూమిలో మంత్రి సోదరుడి వాటా ఉందని, అక్కడ రియల్ వ్యాపారాన్ని ప్రొత్సహించేందుకే రింగ్ రోడ్‌ను తీసుకువచ్చారని అనుమానాలు వ్యక్తం చేశారు. రింగ్ రోడ్డుతో మంథనికి నష్టమే తప్ప, ఇక్కడి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే మంథని నియోజకవర్గంలో నిర్మిస్తున్న 38 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా గోదావరి నది అవతలి నుంచి అడవిశ్రీరాంపూర్ దాకా వెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ హైవేలో అడవిశ్రీరాంపూర్, బేగంపేట, పుట్టపాక, పోతారంలలో మొత్తం నాలుగు ఇంటర్ చేంజ్‌లు ఏర్పాటు చేస్తున్నారని, ఈ క్రమంలో రింగ్ రోడ్డుతో ప్రయోజనం ఏంటో ఆలోచన చేయాలన్నారు. హైవే నిర్మాణం జరిగితే పెద్దపల్లి నుంచి వచ్చే వాళ్లు హైవే ద్వారా గోదావరి నది అవతలికి వెళ్లే అవకాశాలు ఉన్నాయని, రింగ్ రోడ్డు మాత్రం శివ్వారం వరకు మాత్రమే ఉంటుందని, మళ్లీ చెన్నూరు లాంటి ప్రాంతాలకు వెళ్లాలంటే 20 నుంచి 30కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందన్నారు.
కేవలం తమ్ముడి రియల్ ఎస్టేట్ దందా కోసమే ప్రభుత్వ, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. రింగ్ రోడ్డు పేరుతో రైతుల నుంచి భూములు లాకుంటారని, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఎలా గుంజుకున్నారో అదే రీతిలో ఇకడ కూడా జరుగుతున్నదని ఆరోపించారు. రింగ్ రోడ్డు పేరుతో వృథా చేసే రూ.300కోట్లతో మంథనిని అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చన్నారు. కూచీరాజ్పల్లి నుంచి బస్ డిపో మీదుగా రింగ్ రోడ్డు నిర్మించే అవకాశం ఉందని, దాని వల్ల గొల్లగూడెం, బోయినిపేట అభివృద్ధిలోకి వస్తుందన్నారు. కేవలం రూ.100కోట్లతో ఇంటర్నల్ రింగ్ రోడ్లు నిర్మిస్తే సరిపోతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 50 ఏండ్ల క్రితం నిర్మించిన అడవిసోమన్ పల్లి బ్రిడ్జి శిథిలావస్థకు చేరిందని, అకడ మరో బ్రిడ్జి నిర్మిస్తే రాకపోకలు సులభతరం అవుతాయన్నారు. మంథని మండలం ఆరెంద మానేరుపై బ్రిడ్జి నిర్మిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వివరించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నా, అవన్నీ పట్టించుకోకుండా కేవలం సీఎల్ రాజం రియల్ ఎస్టేట్ భూముల కోసమే రింగ్ రోడ్ తీసుకువచ్చారని విమర్శించారు. మేధావులైన మంథని ప్రజలు గొప్పగా ఆలోచన చేయాలని, రూ.300కోట్లు ప్రజాధనం వృథా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని గ్రహించాలన్నారు. తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కేవలం ప్రజలకు ఉపయోగపడే రీతిలో పనులు చేయాలనే ఆకాంక్ష మాత్రమే తమదన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్, తగరం శంకర్‌లాల్, యాకుబ్, మాచీడి రాజుగౌడ్, గొబ్బూరి వంశీ, కనవేన శ్రీనివాస్, ఆరెపల్లి కుమార్, ఆకుల రాజబాపు, ఆసీఫ్ పాల్గొన్నారు.