బోయినపల్లి రూరల్, మే 29: ‘ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. కేంద్రాలకు వడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కొనకపోవడంతో వరుస వర్షాలకు నీళ్లపాలైపోతున్నదని, రైతులు కన్నీటి పర్యంతమవుతున్నా సర్కారు పట్టనట్లు వ్యవహరించడం సరికాదని’ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం శ్రమించి వేసిన పంటను కొంటారో.. కొనరో? సూటిగా చెప్పాలని ప్రశ్నించారు.
పంటను అమ్ముకునేందుకు రైతులు నెల రోజులుగా ఎదురుచూస్తున్నా, ఇందిరమ్మ రాజ్యానికి ఇసుమంతైనా కనికరం కూడా లేదని మండిపడ్డారు. గురువారం బోయినపల్లి మండలం అనంతపల్లిలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అన్నదాత శ్రమ ఆవిరైపోతున్నదని, రోడ్లపై ఎక్కడ చూసినా ధాన్యం రాశులే కనిపిస్తున్నాయని, ఏ రైతును కదిపినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయని మండిపడ్డారు.
పంట కొనుగోలుపై సర్కారు మాటలు నీటిమూటలేనని విమర్శించారు. చివరిగింజ వరకు కొంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అదే అరిగిపోయిన రికార్డును పదేపదే వినిపిస్తున్నా, ఎక్కడా కొంటున్న దాఖలాలు లేవని ధ్వజమెత్తారు. రైతులకు మద్దతు ధర చెల్లించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టకపోతే, అన్నదాతల ఆగ్రహాన్ని ప్రభుత్వం చవిచూడక తప్పదని, రైతుల తరపున తాము సైతం ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.