కరీంనగర్ తెలంగాణచౌక్, జూన్22 : పేదల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నదని సీపీఐ నాయకులు మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి 30 నెలలు గడుస్తున్నా చింతకుంట డబుల్ బెడ్రూం ఇండ్లను ఎందుకు కేటాయించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం పేదల ఆత్మ గౌరవం కోసం చింతకుంటలో నిర్మించిన 600 డబుల్ బెడ్రూం ఇండ్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆ ఇండ్లు వెంటనే పేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తామే పేదలకు అందిస్తామని స్పష్టం చేశారు. పేదలకు ఇండ్లు కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీవో షర్మిలకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నాలో నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, నాయకులు రాజు, సదానందం, మురళీ, సందీప్‌రెడ్డి, శ్రీనివాస్, నాయకురాళ్లు బీర్ల పద్మ, కొట్టె అంజలి, భారతి, స్రవంతి పాల్గొన్నారు.