కోరుట్ల రూరల్ : తీర్ధయాత్రలకు ( Pilgrimages) కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ… తిరిగిరాని లోకానికి వెళ్లిన ఘటన కోరుట్ల ( Kotutla ) మండలం ఐలాపూర్ గ్రామంలో మంగళవారం విషాదం ( Tragedy ) చోటు చేసుకుంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన గాడిపెల్లి నరేష్ గౌడ్ (35) కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి కారులో తీర్ధయాత్రలకు వెళ్లారు.
తీర్ధయాత్రలను ముగించుకొని రాత్రి ఇంటికి వస్తున్న క్రమంలో మంగళవారం తెల్లవారుజామున గ్రామశివారులోని కుమ్మరికుంట సమీపంలో ప్రమాదవశాత్తు ( Accident) కారు చెట్టును ఢీకొనగా నరేష్ గౌడ్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శిరీషకు తీవ్రగాయాలై రెండు చేతులు విరిగిపోయాయి. సమీప బందువైన బొల్లపెల్లి శ్రీనివాస్ గౌడ్‌కు, అతని భార్య సుజాతకు, వీరి కూతురు గాయాలయ్యాయి. మృతుడి ఇద్దరు కుమారులు కార్తికేయ, విహాన్లుండగా స్వల్పగాయాలయ్యాయి. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనే సమయంలో ఇలాంటి దుర్ఘటన జరుగడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతుని అంత్యక్రియలకు మృతుని భార్య శిరీషను ఆసుపత్రిలో చేర్పించగా భర్త కడసారి చూపుకోసం బంధువులు ఆమెను అంత్యక్రియలకు తీసుకొచ్చారు. దీంతో అక్కడ మృతుడి భార్య విలిపించే దృశ్యాలు గ్రామస్థుల కంట తడిపెట్టించాయి. మృతుడు ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చి ఇంట్లో శుభకార్యాలను పూర్తి చేసుకుని, తీర్ధయాత్రలకు వెళ్లి మరో వారంలో తిరిగి దుబాయ్ వెళ్లాల్సింది. అంతా సంతోషంగా ఉన్న కుటుంబంలో ఈ విషాదం జరుగడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.