urea | ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 11: ఏ సొసైటీ గోదాం వద్ద చూసినా రైతులు ఉదయం నుంచే యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తూ కనిపిస్తున్నారు. మండల కేంద్రంలోని కేశవపెరుమాళ్ల స్వామి ఆలయం సమీపంలో ఉన్న ఐకేపీ గోదాం, తిమ్మాపూర్ సొసైటీ పరిదిలోని గోదాంకు సోమవారం కేవలం 300 బ్యాగులే వచ్చాయని తెలియడంతో గుండారం, తిమ్మాపూర్, వీర్నపల్లి మండలం మద్దిమల్ల రైతులు పెద్ద మొత్తంలో గోదాం వద్దకు చేరుకున్నారు.
అల్మాస్పూర్ సొసైటీ పరిదిలోని దుమాల గోదాంకు 440 యూరియా బ్యాగులు వచ్చాయని తెలియడంతో అల్మాస్పూర్, దుమాల, అక్కపల్లి రైతులు ఉదయం నుంచే పడిగాపులు కాస్తూ గోదాం వద్ద కూర్చున్న పరిస్థితులు కనిపించాయి. ఎల్లారెడ్డిపేట సొసైటీ పరిధిలోని వెంకటాపూర్ గోదాంకు 3వందల బ్యాగులు వచ్చాయని తిరిగి మల్లీ ఎప్పుడు వస్తాయో అని ఆందోళనతో వెంకటాపూర్ రైతులు పెద్దమొత్తంలో చేరుకోవడంతో అక్కడ ఏదైనా గొడవ జరిగే అవకాశముంటుందనే ముందస్తు సమచారంతో పోలీసుల పహారా మధ్య యూరియా బస్తాలు పంచారు.
ఎకరానికి ఒక బ్యాగు చొప్పున పంచినా రైతులందరికీ సరిపడా యూరియా రాలేదని అందువల్లే గోదాముల వద్ద రైతులు నిరీక్షిస్తూ కనిపిస్తున్నారని రైతులు తెలిపారు. గ్రోమోర్ కేంద్రాల్లో సైతం ఎరువులు లేక పోవడం బాధాకరమని రైతులు ఆవేదనగా తెలిపారు.