check dams | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 09 : వృథాగా పోతున్న వరదనీటిని ఒడిసి పట్టి, భూగర్భజలాలు పెంచాలనే నీటిపారుదల శాఖ లక్ష్యం నీరు గారిపోతున్నది. భారీ వర్షాలతో కొట్టుకుపోయిన చెక్ డ్యాంలకు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుండగా, జిల్లాలో వరుసగా రెండో యేడు కూడా వేసవికి ముందే భూగర్భజలాలు అడుగంటడం మొదలయ్యాయి. దీంతో, నీటి కొరత రోజు రోజుకు తీవ్రమవుతుండగా, జిల్లా ప్రజానీకంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లాలోని ప్రధాన వాగులన్నిటిని జీవ నదులుగా మార్చుతూ, రైతాంగానికి సాగునీటి కొరత రాకుండా చూడాలనే తలంపుతో స్వరాష్ట్రంలో గత ప్రభుత్వము నీటిపారుదల, అటవీ శాఖలు, వాటర్ షెడ్ల ఆధ్వర్యంలో చెక్ డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పాత వాటికి మరమ్మతులు చేపట్టి, నీటి నిల్వ చేసేందుకు కృషి చేసింది. దీంతో, అనతికాలంలోనే ఊహించని విధంగా నిల్వలు పెరిగి , భూమాట్టానికి సమానంగా చేరుకున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటిని ఎత్తిపోయటంతో ఉమ్మడి జిల్లా వాటర్ హబ్ గా మారింది.
స్వరాష్ట్ర సాధనకు ముందు కాల్వలు, వాగులపై అడ్డంగా, అడవుల్లో నిర్మించిన చెక్ డ్యాం లు ప్రస్తుతం చాలాచోట్ల అధ్వానంగా మారాయి. గతేడాది వర్షాకాలంలో కురిసిన వానలకు కొన్ని ద్వంసం కావడం, మరికొన్నిచోట్ల మత్తడి కింది నుంచి నీరు లీకేజీ అవుతుండటంతో వరద నీరు నిల్వ ఉండడం లేదు. పలుచోట్ల ఆయా గ్రామాల ప్రజలు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టినా, పూర్తి స్థాయిలో మరమ్మత్తులపై దృష్టి సారించకపోవడంతో, క్రమేపి బలహీన పడుతున్నాయి. వీటిలో నీటి నిల్వ ఉంటేనే పరిసరాల్లోని వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు వృద్ధి చెంది సమృద్ధిగా నీటి లభ్యత అవకాశం ఉంటుంది.
జిల్లాలో 21 చెక్ డ్యామ్ లు ఉండగా, అత్యధికంగా నీటి నిల్వ లేక వెలవెలబోతున్నాయి. వర్షాలు పడ్డప్పుడు మాత్రమే నీరు కనిపిస్తుండగా, అనంతరం ఎండిపోతున్నాయి. అలాగే, భారీ వరదలతో ధ్వంసమైన వాటి పట్ల కూడా నిర్లక్ష్యం తాండవిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా వీణవంక మండలంలోని కోర్కల్ చెక్ డ్యాం, శంకరపట్నం మండలంలో గల కల్వల ప్రాజెక్టు మరమ్మతుల కోసం నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించినా, నిధుల విడుదలలో పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుందనేది స్పష్టమవుతుంది.
మత్తడి లీకేజీలు ఉన్న వాటిలో ఒకటో, రెండో చెక్ డ్యాంలకు మాత్రమే పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మిగతావాటికి కూడా కొద్దిపాటి మరమ్మతులు చేసినా వినియోగంలోకి వచ్చే అవకాశాలుండగా, పాలకుల నిర్లక్ష్యంపై ప్రజల్లో తీవ్ర అసహనం పెల్లుబికుతున్నది. వర్షాకాలానికి ముందు మరమ్మత్తులు చేపడితేనే, ఫలితం ఉంటుంది. ఇప్పటికిప్పుడు పనులు ప్రారంభించినా, ధ్వంసమైన వాటిని పూర్తి చేసేందుకు కనీసం రెండు నుంచి మూడు నెలలు పట్టే అవకాశం ఉంటుంది. నీటి నిలువల పెంపు కోసం మాటలకే పరిమితం కాకుండా, మరమ్మతులకు నిధులు విడుదల చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలనే డిమాండ్ ప్రజల నుంచి వస్తోంది.
చెక్ డ్యాంలతో అనేక ప్రయోజనాలు :
జిల్లాలోని పలుచోట్ల చెక్ డ్యాంలు తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు నీరు వృథాగా వెళ్లకుండా భూగర్భములోకి వెళ్లేలా చేస్తూ, మిగతా నీటిని భూమిపై నిల్పుతున్నాయి. వీటి పరిసరాల్లో కొన్ని వందల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో భూగర్భజలాలు వృద్ధి చెందాయి. పరివాహక ప్రాంతాల్లోని అనేక గ్రామాలకు చెందిన ఎంతో మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. వన్యప్రాణులకు కూడా మండుటెండల్లో సైతం నీటిని అందించడానికి ఎంతగానో ఉపయోగపడేవి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహణ లేకపోవటంతోనే అధ్వానంగా తయారయ్యాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై సంబంధిత శాఖ డిఈని వివరణ కోరగా, అవసరమైన చోట మరమ్మతులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. అనుమతులు రాగానే మరమ్మతుల పనులు ప్రారంభిస్తామని చెప్పారు.