TBGKS | గోదావరిఖని: : సింగరేణి కార్మికుల సమస్యలకు మెడికల్ బోర్డు కు సంబంధించిన విషయాలలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు కార్మిక సంఘం అయిన ఏఐటీయూసీ ప్రాతినిధ్య సంఘమైన ఐఎన్టీయూసీ నాయకులు తాము మంత్రులను సీఅండ్ఎండీ ని అధికారులను అందర్నీ కలిశామని చెప్పుకుంటూ పాత ఫొటోలను పోస్ట్ చేస్తూ త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతాయని చెప్పుకుంటూ కార్మికులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై కార్మికులందరూ గమనించాలని కోరారు. 23న జరిగే మెడికల్ బోర్డు తానంటే తానే పెట్టించానని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అసలు ఇది రెగ్యులర్ మెడికల్ బోర్డు కాదని, మూడున్నర సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న 52 మందికి సంబంధించిన బోర్డు అని వారు తెలియజేశారు. గతంలో బోర్డుకి పిలిచిన వారిని మళ్లీ పిలుస్తూ మెడికల్ బోర్డు మొదలైందని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
సింగరేణి సంస్థలో రెండు సంవత్సరాలకు ముందు అప్లై చేసుకున్న వారందరినీ పిలిచే రెగ్యులర్ బోర్డు కావాలని కార్మికులందరూ రెగ్యులర్ మెడికల్ బోర్డు కోరుకుంటున్నారని, కానీ ఇదే రెగ్యులర్ బోర్డ్ అని చెప్పుకుంటూ వీరందరూ కార్మికులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణి లో కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉందని ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నియామకాలు చేపట్టలేమని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసి మెడికల్ బోర్డును నిర్వహించకుండా జాప్కం చేస్తున్న క్రమంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు తామేమో చేశామని మెడికల్ బోర్డు నిర్వహిస్తున్నామని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఇప్పటికైనా వారు కార్మికులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కొత్త బావుల పేరిట ప్రభుత్వం, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు కార్మికులను మోసం చేస్తున్నారని ఇవన్నీ పాత మైన్స్ విస్తరణ పర్మిషన్స్ మాత్రమే వచ్చాయని, కొన్నిటికి గతంలోనే పర్మిషన్లు వచ్చాయని దీనిపైన కూడా కొత్త బావుల పేరిట ఆసత్య ప్రచారాలు చేసుకుంటున్నారని కార్మిక సోదరులందరూ గమనించాలని పేర్కొన్నారు. మారుపేర్ల సమస్య కూడా తీవ్ర జాప్యం చేస్తూ లీగల్ ఒపీనియన్ పెరిట తాత్సారం చేస్తున్నారని, పదో తరగతి పాస్ గాని డిపెండెంట్ లకు విజిలెన్స్ పేరిట వేధించే సర్కులర్లను వెంటనే నిలుపుదల చేయాలని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నూనె కొమరయ్య, అయిలి శ్రీనివాస్, జావేద్ పాషా తదితరులు పాల్గొన్నారు.