Rangpur | పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 19 : పెద్దపల్లి మండలంలోని రంగాపూర్ లో ఎన్నికలు ఏవైనా ఆ దంపతులకు అధికారం ఉండాల్సిందే అంటూ గ్రామస్తులు అవకాశం కల్పిస్తూ ఆశీర్వదిస్తూ వస్తున్నారు. గతంలో రంగాపూర్ గ్రామాన్ని 15 ఏళ్లు సర్పంచ్ గా, ఎంపీటీసీగా రంగాపూర్ గ్రామస్తులు వారికి అవకాశం ఇచ్చారు. మళ్లీ ఈ ఐదేళ్ల కాలానికి సర్పంచ్ గా ఆ కుటుంబానికే అధికారం అప్పగించి విలక్షణమైన తీర్పును ఓటు హక్కు ద్వారా ఆకుటుంబానికి విజయం వరించేలా గెలిపించి సర్పంచ్ గా అవకాశం కల్పించారు.
వివరాల ప్రకారం.. పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలో గత 15 ఏళ్లు పాలించిన గంట లావణ్య-రమేష్ దంపతులకే ప్రజలు మళ్లీ అవకాశం ఇచ్చి సర్పంచ్ పీఠం కట్టబెట్టారు. 2006 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా గంట రమేష్ సమీప ప్రత్యర్థి దుబాసి భద్రయ్యపై ఎంపీటీసీగా విజయం సాధించారు. అక్కడి నుంచి ప్రారంభమైన వారి రాజకీయ ప్రస్తానం వరుస విజయాల పరంపరలో నడుస్తున్నది.
2013 లో జరిగిన ఎన్నికల్లో గంట రమేష్ సతీమణి లావణ్య తన సమీప ప్రత్యర్థి కలబోయిన ఉమా మహేశ్వరిపై సర్పంచ్ గా గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కలబోయిన స్వప్నపై విజయం సాధించారు. 15 ఏళ్లపాటు గ్రామాన్ని పాలించిన గంట దంపతులకే వారు చేస్తున్న అభివృద్ధి, సేవలను గుర్తించి తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఓటు హక్కు ద్వారా ప్రజలు విలక్షణమైన తీర్పును ఇచ్చి రమేష్ ను గెలిపించుకున్నారు.
ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో గంట రమేష్ సర్పంచ్ గా పోటీ చేయగా తన సమీప ప్రత్యర్థి కలబోయిన నరేందర్ పై ఉత్కంఠబరితంగా సాగిన హోరాహోరి పోరులో గంట రమేష్ విజయం సాధించి ఎన్నికలు ఏవైనా గంట దంపతులదే.. గంట కుటుంబానిదే రంగాపూర్ గ్రామం అనేలా గంట రమేష్ ను సర్పంచ్ గా గెలిపించి అవకాశం కల్పించారు. దీంతో పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం రంగాపూర్ చరిత్రలో అరుదైన రికార్డును గంట లావణ్యరమేష్ దంపతులు సొంత చేసుకున్నారు.