తిమ్మాపూర్, సెప్టెంబర్ 28 : రాంలీలా పేరిట ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆయన అంతరంగికుడితో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ఆరోపించారు. వసూళ్లు ఆపకపోతే ఎల్ఎండీలోని అమరవీరుల స్తూపం నుంచి ట్యాంక్‌బండ్ అమరవీరుల స్తూపం వరకు వెయ్యి మందితో పాదయాత్ర చేసి, బండారం బయట పెడుతానని హెచ్చరించారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
అసలు రాంలీలాకు, ఎమ్మెల్యేకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. మహాత్మానగర్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నో ఏండ్లుగా నిర్వహిస్తున్న రాంలీలా వేడుకలను తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎనిమిదేండ్లుగా కళాకారుల ఆటాపాటలతో నిర్వహించామని, దసరా రోజు వేల కుటుంబాలు ఆనందంగా వీక్షించాయని గుర్తు చేశారు. తామెక్కడ కమిటీ వేసి వేడుకలు నిర్వహిస్తామోనని ముందుగానే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలనే కమిటీలో వేసి పోస్టర్ రిలీజ్ చేశారని దుయ్యబట్టారు. తాను వేడుకలు నిర్వహించినప్పుడు అన్ని పార్టీల నాయకులకు అవకాశం కల్పించానని, ఎవరినీ ఒక్క రూపాయి అడగలేదని, సొంతంగా నిర్వహించానని స్పష్టం చేశారు.
తాము, తమ నాయకులు కమిటీలో ఉంటే వసూళ్లకు సాధ్యం కాదనే ఆయన అనుచరగణంతో కమిటీ వేసి టార్గెట్ పెట్టారన్నారు. తిమ్మాపూర్ జడ్పీటీసీగా ఉన్న సమయంలో ఒక్కసారి కూడా రాని కవ్వంపల్లి.. నేడు అందినకాడికి దోచుకునేందుకే వస్తున్నాడని ఆరోపించారు. సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన రాంలీలా వేడుకలకు అవినీతి మరకలు అంటించవద్దని హితవుపలికారు. వేడుకలు నిర్వహించడం చేతకాకపోతే తప్పుకోవాలని, మాజీ ఎమ్మెల్యేగా తాను, ఎమ్మెల్యేగా ఆయన చెరో 5 లక్షలు కమిటీకి ఇచ్చి వేడుకలు జరిపిద్దామని సవాల్ విసిరారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న పదేండ్లలో ఇంటింటికీ వెళ్లి సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు ఇస్తే.. ‘ఇది కాదు అభివృద్ధి అంటే’ అని విమర్శించిన కవ్వంపల్లి.. ఇప్పుడు ‘ఆయన చేస్తున్న వసూళ్లేనా..? అభివృద్ధి అంటే’ అని ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు ఒక్క రోడ్డు, కులసంఘ భవనం నిర్మించలేదని, తాను నిధులు ఇచ్చినవే ప్రారంభించుకుంటూ వెళ్తున్నాడని ఎద్దేవా చేశారు.
షాడో వసూళ్లు తేలుస్తా..
కవ్వంపల్లికి ఆంతరంగికుడైన షాడో ఎమ్మెల్యే మురళీధర్‌రెడ్డి చేస్తున్న అరాచకాలు ఎమ్మెల్యేకు తెలిసే జరుగుతున్నాయా..? అని రసమయి సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఆయన ఆంతరంగికుడు ఎవరెవరిని డబ్బులు అడుగుతున్నారో తన వద్ద అన్ని సాక్ష్యాలున్నాయని, ఆధారాలతోనే మాట్లాడుతున్నానని, ఆ వసూళ్ల సంగతి తేలుస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల వసూళ్ల దందా.. ఏంటని నిలదీశారు. ఆయన బాధితుల్లో కాంగ్రెస్ నాయకులు సైతం ఉన్నారన్నారు. ఆయన పెట్టించే వెకిలి పోస్టులపై చట్టపరమైన చర్యలకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.
సీఎంకు ఫిర్యాదు చేస్తా
ఎమ్మెల్యే వసూళ్లన్నీ ఇబ్రహీంపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసమేనని రసమయి ఆరోపించారు. కాలేజీకి 300కోట్లు అవసరమని, ఇప్పటికే వంద కోట్లు వచ్చాయని.. మరో 200 కోట్ల కోసం నియోజకవర్గ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతారోనని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆయన షాడో ద్వారా రేషన్ బియ్యం అమ్ముకునే వారి నుంచి రియల్, కాంట్రాక్టర్లు, ఇసుక ట్రాక్టర్లు ఇలా ఎవరినీ వదలడం లేదని విమర్శించారు. ఆయన చేస్తున్న చిల్లర రాజకీయాలు, దందాలపై సోషల్ మీడియాలో ప్రశ్నించిన సుదగోని సదిగౌడ్, నాగరాజుతోపాటు మరెందరో యువకుల మీద కేసులు బనాయించారని మండిపడ్డారు.
వసూళ్లు ఆపకపోతే డీజీపీ, ముఖ్యమంత్రికి, డీజీపీ ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వసూళ్లపై కరీంనగర్ సీపీ దృష్టిసారించాలని కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఇనుకొండ జితేందర్‌రెడ్డి, పోరండ్ల సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి స్వామిరెడ్డి, నాయకులు బోయిని కొమురయ్య, మాతంగి లక్ష్మణ్, పాశం అశోక్‌రెడ్డి, పొన్నం అనిల్, వడ్లూరి శంకర్, పొన్నాల సంపత్ పాల్గొన్నారు.
అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తా..
ఎమ్మెల్యే గెలుపు కోసం కష్టపడి పని చేసిన నాయకుడు కాల్వ మల్లేశం వద్దే వసూళ్లు చేసిన కవ్వంపల్లికి రాంలీలా పేరిట వసూలు చేసుకోవడం కష్టమైన పని కాదని రసమయి సెటైర్లు వేశారు. రియల్ ఎస్టేట్ చేసుకుంటున్న వారిని కూడా పీడిస్తున్న విషయం వాస్తవం కాదా..? గన్నేరువరం డబుల్ రోడ్డు కాంట్రాక్టర్‌కు బిల్లులు ఇప్పిస్తానని వసూళ్లు చేసి మోసం చేసింది వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇల్లంతకుంటలో అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తే, దానిని ప్రారంభించి దళితసంఘ నాయకులకు ఖర్చులకు ఇస్తానన్న 20 వేలు ఇవ్వని కవ్వంపల్లి.. రాంలీలాకు సొంతంగా ఖర్చు పెడుతాడా..? అని నిలదీశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు కోటి టార్గెట్ పెట్టింది నిజం కాదా..? ప్రశ్నించారు. ఎప్పుడు ఎలాంటి వసూళ్లు అడుగుతారోనని అధికారులు, కార్యకర్తలు బెంబేలెత్తుతున్నారన్నారు. తాను చెప్పినవి అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తానని స్పష్టం చేశారు.