Ramagundam | కోల్ సిటీ, జూన్ 16: రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో అసలేం జరుగుతుంది..? డివిజన్ల పునర్విభజనకు సంబంధించి ఇటీవల వెలువరించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (ముసాయిదా)ను ఫైనల్ చేస్తారా..? లేదంటే సవరిస్తారా..? అన్నది ఎటూ తేలడం లేదు. సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంకు చేరుకొని దాదాపు 4 గంటల పాటు ఇక్కడే అధికారులతో వేర్వేరుగా సమీక్షలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. విభజనకు సంబంధించి డివిజన్ల కొత్త ముఖ చిత్రంను సమగ్రంగా పరిశీలించడం, ఆయా విభాగాల అధికారులతో వేర్వేరుగా వివరాలు సేకరించారు.
కాగా, పలువురు ఆశావహులు, రాజకీయ పార్టీల నాయకులు డివిజన్ల పునర్విభజనపై తమ అభ్యంతరాలు తెలిపేందుకు కార్యాలయంకు చేరుకోగా కలెక్టర్ కలిసేందుకు గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. ముందుగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో భేటీ అయిన జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి కోయ శ్రీహర్ష డివిజన్ల విభజనపై వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కార్యాలయం పై అంతస్తులో ఉన్న పట్టణ ప్రణాళిక విభాగంకు నేరుగా కలెక్టర్ వెళ్లి అక్కడ సంబంధిత అధికారులతో చాలా సేపు చర్చించారు. డివిజన్ల విభజన అనంతరం మ్యాప్ లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
ఆ తర్వాత మళ్లీ కిందకు వచ్చి అదనపు కలెక్టర్, ఇతర అధికారులతో రహస్యంగా సమావేశమై నాలుగు గంటల పాటు చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్ని గంటల సేపు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఆయా విభాగాలు కలియతిరగడంతో అసలేం జరుగుతుందో తెలియక అధికారులు హైరానా పడ్డారు. మాజీ కార్పొరేటర్లు పలువురు కలెక్టర్ ను కలిసేందుకు విఫలయత్నం చేశారు. కొందరు తమ డివిజన్లలో చాలా అవకతవకలు జరిగాయంటూ కలెక్టర్ ను ఎలాగోలా నేరుగా కలిసి విన్నవించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వెలువడిన అనంతరం ఈనెల 11 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. దాదాపు మెజారిటీ డివిజన్ల నుంచి చివరి గడువు వరకు 63 వరకు అభ్యంతరాలు వచ్చాయి.
వీటిపై పునఃపరిశీలించి సోమవారం జిల్లా కలెక్టర్ కు నివేదిక అందజేయాల్సి ఉంది. వాస్తవానికి మంగళవారం జిల్లా కలెక్టర్ రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సమావేశంకు సంబంధించి షెడ్యూల్ ఉండగా, ఎవరు ఊహించని విధంగా సోమవారమే ఆయన ఆకస్మాత్తుగా కార్యాలయంను సందర్శించి అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ప్రతి ఒక్కరి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని అందరికీ సమాన న్యాయం చేస్తామని కలెక్టర్ పలువురికి హామీ ఇచ్చారు. ఏది ఏమైనా ఈనెల 21వ తేదీన సిడిఎంఏ ప్రకటించే తుది ముసాయిదా వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.