విశ్రాంత ఉద్యోగుల కడుపు రగులుతున్నది. కాంగ్రెస్ సర్కారు తీరుతో కంట కన్నీరు కారుతున్నది. మూడు, నాలుగు దశాబ్దాలపాటు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవలందించి, రిటైర్మెంట్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ కోసం కాళ్లరిగేలా తిరగాల్సి వస్తున్నది. గత ఉద్యోగి విరమణ పొందగానే ప్రయోజనాలు అందగా, ప్రస్తుతం ఆరు నెలలైనా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నది. గత మార్చి 31 తర్వాత జగిత్యాల జిల్లాలో 264 మంది సర్వీసు నుంచి దిగిపోగా, అందరికీ పెండింగ్‌లోనే పెట్టింది. ఈ నెలలోనూ రిటైర్మెంట్ తీసుకున్న మరో 50 మందికి ఇవ్వనట్టు తెలుస్తుండగా, ప్రభుత్వం వెంటనే స్పందించాలని, వెంటనే సెటిల్ చేయాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
జగిత్యాల, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ఉపాధ్యాయులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అరిగోసపడుతున్నారు. రిటైర్మెంట్ తీసుకొని ఆరు నెలలు దాటినా ప్రయోజనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వం, రెండో దఫాలో తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించే ఉద్దేశంతో విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరిగింది.
కేసీఆర్ పెంచిన విరమణ వయసు వల్ల నిలిచిపోయిన రిటైర్మెంట్లు ఈ యేడాది మార్చి 31తో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా దాదాపు 1800 నుంచి 2వేల మంది విరమణ పొందుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు అందిన లెక్కల ప్రకారం ఈ ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో 12,296 మంది, జగిత్యాల జిల్లాలో 264 మంది విమరణ పొందారు. సాధారణంగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు పనిచేసిన కాలంలో జమ చేసుకున్న జీపీఎఫ్‌తో పాటు, ఇతర ప్రయోజనాలు అన్నింటినీ కలిపి రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ప్రభుత్వం అందజేస్తున్నది.
సహజంగానే ఉద్యోగి రిటైర్మెంట్ గడువు సమీపిస్తున్న తరుణంలో వారికి సంబంధించిన అన్ని వివరాలను సేకరించి, వాటి ఆధారంగా రిటైర్మెంట్ తర్వాత వారం పది రోజులు, గరిష్టంగా నెల రోజుల వ్యవధిలో అన్ని ప్రయోజనాలను అందజేస్తూ వచ్చేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు ఆరు నెలలు గడిచినా బెనిఫిట్స్ మంజూరు చేయడం లేదు.
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
ప్రభుత్వం నుంచి విరమణ ప్రయోజనాలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో రిటైర్డ్ ఉద్యోగులు, వారి కుటుంబాలు అవస్థలు పడుతున్నారు. రిటైర్ అయ్యాక వచ్చే మొత్తాన్ని లెకేసుకొని పిల్లల వివాహాలు, ఇంటి నిర్మాణం, తదితర అవసరాల కోసం ప్రణాళికలు రూపొందించుకున్న వారు, సొమ్ము చేతికి అందుతుందనే భరోసాతో అప్పులు చేసి కార్యాలను గట్టెకించుకున్న వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నెలలు గడుస్తున్నా ఇంకా ఆ విరమణ సొమ్ము చేతికి అందకపోవడంతో సతమతమవుతున్నారు.
కొందరు బయట తెచ్చిన అప్పులకు వడ్డీ భారం పెరుగుతున్నదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులతోపాటు సర్వీసు పూర్తవబోతున్న ఏ ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు కలిసినా ఇదే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం ఎందుకు బెనిఫిట్స్ మంజూరు చేయడం లేదు, కావాలనే జాప్యం చేస్తుందా..? అసలు ఆర్థిక ప్రయోజనాలు ప్రభుత్వం ఇస్తుందా..? ఇవ్వక పోతే పరిస్థితి ఏమిటో? అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఓవైపు చేసిన అప్పులు, వాటికి పెరిగిపోతున్న వడ్డీతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నామంటున్నారు. ప్రభుత్వ వ్యవహారశైలి చూస్తే ఇబ్బందికరంగా ఉందని, ఇలాంటి పరిస్థితి కొనసాగితే ‘వృద్ధాప్యంలో ఎలా బతకాలి?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక విరమణ పొందడానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగుల్లోనూ ఆందోళన నెలకొంటున్నది. ఒకవైపు రిటైర్మెంట్ సమయం సమీపిస్తుండడం, ప్రభుత్వం చూస్తే బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యం చేస్తుండడంతో వచ్చే సగం వేతనంతో ఎలా బతకాలో..? ఇప్పటి నుంచే భయం వేస్తుందని అంటున్నారు. విరమణ పొంది ఇటు ప్రయోజనాలు అందని పలువురు పెన్షనర్లు, వివిధ సంఘాల నేతల వెంటబడి తిరుగుతూ ప్రయోజనాలు సత్వరం వచ్చేలా చూడాలని కోరుతుండడం నిత్యకృత్యమైపోతున్నది.
ప్రయోజనాలు ఇవ్వాల్సింది ఇలా..
విరమణ చెందిన ఉద్యోగికి గ్రాట్యుటీ, వేతనం నుంచి ప్రతి నెలా ప్రభుత్వం వద్ద పొదుపు చేసుకున్న జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రూప్ ఇన్సూరెన్స్, కమ్యూటేషన్, సరెండర్ లీవులు తదితర రూపేణా ఇవ్వాల్సిన ప్రయోజనాల సొమ్ము ఏక మొత్తంలో విరమణ చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఎంత చిన్న ప్రభుత్వ ఉద్యోగికి అయినా, కనీసం 35 లక్షల నుంచి 70 లక్షల వరకు పెన్షన్ బెనిఫిట్స్ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుంది. వీటిని చెల్లించడంలో ఆలస్యమైనా వడ్డీ ఏమైనా ప్రభుత్వం ఇస్తుందా..? అంటే అలాంటిదేమి ఉండదు.
విరమణ పొందిన ఉద్యోగి ఆరు నెలల కాలానికి తన బెనిఫిట్స్‌కు సంబంధించి ఒక రకంగా బ్యాంకు వడ్డీ చొప్పున లెక్క గట్టినా, 3లక్షల నుంచి 5 లక్షల వరకు నష్టపోయినట్టే. ఈ ఆరు నెలల కాలంలో విరమణ చెందిన అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్ని ప్రయోజనాలు చెల్లించాలని అంటే 2వేల కోట్ల నుంచి 2600 కోట్ల వరకు అవసరమని అంచనా వేస్తున్నారు. ప్రతి జిల్లాలో వివిధ రకాల చెల్లింపులు, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, జగిత్యాల జిల్లాలో రిటైర్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధికారులు ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అందక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆరు నెలలైనా బెనిఫిట్స్ ఇవ్వరా..?
నేను నాలుగు దశాబ్దాలు ప్రభుత్వ ఉద్యోగం చేశా. సాధారణ గుమస్తాగా ఉద్యోగాన్ని ప్రారంభించి, గెజిటెడ్ అధికారి హోదాకు చేరా. 40 ఏండ్ల ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నా. నలభై ఏండ్లు పనిచేసినా నా వ్యక్తిగత సమస్యలు, నా కుటుంబ సమస్యలు ఇంకా పూర్తిగా తీరనే లేదు. ఇళ్లు కట్టినా, పిల్లల పెండ్లి చేసినా, కొడుకును చదివించినా అన్నింటికీ పెద్ద మొత్తంలోనే ఖర్చయింది. ఇంకా అప్పులు ఉన్నాయి. కట్టిన ఇంటికి సంబంధించిన లోన్ బ్యాంకులో అలాగే ఉంది. కొన్న వెహికిల్ చెల్లింపులు ఉన్నాయి.
అయితే 40 ఏండ్ల నుంచి జీపీఎఫ్ పేరిట, ఇతరత్రా పద్ధతుల్లో న్యాయబద్ధంగా కూడబెట్టాను. రిటైర్మెంట్ అయితే అరవై, అరవై ఐదు లక్షలు వస్తాయని లెక్క వేసుకున్నా. ఆ డబ్బులతో అప్పులు చెల్లించాలని ప్రణాళిక చేసుకున్నా. కానీ చాలా దారుణం. విరమణ పొంది ఆరు నెలలు అవుతున్నా ఇంత వరకు బెనిఫిట్స్ ఇవ్వలేదు. నేను పనిచేసిన ఆఫీస్ చుట్టూ, రిటైర్మెంట్ అయిన ఉద్యోగ సంఘాల నాయకుల చుట్టూ తిరగడానికే సరిపోతోంది. నాలుగు నెలలుగా డబ్బులు ఎప్పుడు వస్తాయోనని..? ఎదురుచూడడమే సరిపోతుంది. ఎప్పుడు బెనిఫిట్స్ ఇస్తారో అర్థం కావడం లేదు. చేసిన అప్పులకు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. కానీ రావాల్సిన ప్రయోజనాలు మాత్రం రావడం లేదు.
– మార్చి 31న విరమణ చేసిన ఓ గెజిటెడ్ స్థాయి అధికారి
సత్వరమే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి
ప్రభుత్వం ఆరు నెలలుగా పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం బాధాకరం. కొత్త ప్రభుత్వం విరమణ ప్రయోజనాలను సత్వరం చెల్లించేలా టీపీసీఏ రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో ఒత్తిడి తెస్తాం. ఇప్పటికే టీజీ జాక్ తరపున రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ ఆధ్వర్యంలో పలుసార్లు ప్రభుత్వానికి విన్నవించాం. అయినా పెద్దగా స్పందన రాలేదు. రిటైర్మెంట్ ఉద్యోగుల గోసలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి పెన్షన్ ప్రయోజనాలు చెల్లింపులు చేయించాలని మా అసోసియేషన్ తరపున కోరుతున్నాం. అలాగే ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయి ఉన్న నాలుగు డీఏలు, పీఆర్సీ, ఫిట్మెంట్, నగదు రహిత వైద్య సేవలు, కమ్యూటేషన్ రిస్టోరేషన్, రికవరీ పీరియడ్ 15 ఏండ్లు కాకుండా 12 ఏళ్లు పూర్తి కాగానే తగ్గింపు, 20 ఏండ్లకు ఫుల్ పెన్షన్ తదితర సమస్యలన్నీ అలాగే ఉండిపోయాయి. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం.
– హరి అశోక్ కుమార్, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
(జగిత్యాల)