Ellala Srikanth Reddy | ధర్మపురి, డిసెంబర్ 20: రైతునుంచి సన్నరకం ధాన్యం తీసుకొని వాటికి దొడ్డు రకం పేరిట ట్రక్ షీట్ ఇచ్చి మోసానికి పాల్పడుతూ కలెక్టర్ కు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారిపై ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, కాంగ్రెస్ పార్టీలో చేరితే చేసిన కుంభకోణాలు, మోసాలు, తప్పులన్నీ మాఫీయేనా..? అంటూ బీఆర్ఎస్ నాయకులు, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ప్రశ్నించారు. ధర్మపురి పట్టణంలోని ఆయన నివాసంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో భారీ కుంభకోణాలు చూ స్తున్నామన్నారు. ధర్మపురి మండలం జైన సహకార సంఘ పరిధిలోని కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్దనుండి సన్నరకం ధాన్యాన్ని కొనుగోలు చేసి, కొనుగోలు చేసిన ధాన్యానికి దొడ్డు రకం కింద ట్రక్ షీట్ ఇచ్చి, కొనుగోలు చేసినదానికంటే 25 శాతం అధికంగా రైతులనుండి కొనుగోలు చేసినట్లు రికార్డులు మార్చి ట్రక్ షీట్ ఇచ్చి దోపిడీకి పాల్చడిన ప్యాక్స్ చైర్మన్, బాధ్యులపై మంత్రి హోదాలో చర్యలు తీసుకోకుండా, అధికారులను చర్యలు తీసుకోనివ్వకుండా వారిని కాపాడుతూ మోసాలకు పాల్పడ్డవారిని పార్టీలో చేర్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోలు సమయంలో జిల్లా ఆడిషనల్ కలెక్టర్ బీఎస్ లత అప్పుడు ధమ్మన్నపేట గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన సందర్భంలో ఈ మోసపూరిత కార్యకలాపం బయటపడిందని గుర్తుచేశారు. అప్పుడు ఆదనపు కలెక్టర్ ప్యాక్స్ సీఈఓను సస్పెండ్ చేసి తదుపరి విచారణకు ఆదేశించారని గుర్తుచేశారు. అప్పటినుండి ఇప్పటివరకు ఎటువంటి విచారణ చేపట్టలేదని, రెడ్ హ్యాండెడ్ పట్టుబడ్డ వారిపై ఇప్పటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు.
రైతులు పండించిన సన్నరకం దాన్యాన్ని జైన సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశారని, అయితే రూ. 2350 మద్దతు ధరతో పాటు సన్నరకాలకు ప్రభుత్వం ఇచ్చే బోనస్ డబ్బులు రూ.500 కలిపి ఇస్తామని రైతులను నమ్మించి సన్నరకాలు కొనుగోలు చేశారని, అయితే సన్నరకాల స్థానంలో దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేసినట్టు దికార్డు చేసి, రైతులను మోసం చేసి సన్నవడ్లను కొనుగోలు చేసి దొడ్డు రకాలుగా ట్రక్ షీట్లో ప్రతీ క్వింటాలు మీద 25శాతం ఎక్కువ కొనుగోలు చేసినట్లుగా రాసి దారుణమైన మోసానికి పాల్పడ్డారని గుర్తుచేశారు.
ఇటువంటి మోసాలు కుంభకోణాలు క్యాన్సర్ తో సమానమని మొగ్గదశలోనే తుంచివేయాల్సిఉండగా మంత్రి హోదాలో సమర్థించుకుంటూరావడం దారుణమన్నారు. ఇటువంటి కుంభకోణాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవలసిందిపోయి పార్టీలో చేర్చుకోవడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కుంభకోణాలను సమర్థించిన నాయకులు గతంలో ఏ పార్టీలో లేరన్నారు. ఏదో రూ.కోటి, రూ.రెండు కోట్ల స్కామ్ అని ఇప్పుడు వదిలేస్తే ఈ కుంభకోణం రాష్ట్రంలో వ్యాపించి కేంద్రం దృష్టికి వెళ్లి తెలంగాణ ధాన్యం సేకరించలేమని కేంద్రం ప్రకటిస్తే తెలంగాణ రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
జిల్లాలో ఏ సహకార సంఘం పరిధిలోనైనా..?ఏ గ్రామం నుండి ఏ రకం వడ్లు సేకరించారో రికార్డులు ఉంటాయన్నారు. చిత్తశుద్ధి ఉంటే జరిగిన కుంభకోణాలపై ప్రత్యేకాధికారిని నియమించి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రికార్డులు పరిశీలించి రైతులను మోసంచేసిన వారిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల, పట్టణ కన్వీనర్లు అయ్యోరి రాజేష్ కుమార్, బండారి రంజిత్, నాయకులు సంగిశేఖర్, చిలివేరి శ్యాంసుందర్, వొడ్నాల మల్లేశం, సంబంకాడి మహేశ్, పెరుమాండ్ల ఎల్లా గౌడ్, తరాల కార్తీక్, అయ్యోరి వేణు, యూనుస్, అసిఫ్ ,చుక్క రని, వేముల నరేశ్, కాశెట్టి విజయ్, భీమరాజు, శ్రీకాంత్, రాజేందర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.