What a waste..| కోల్ సిటీ, జూన్ 19: యే దుబారా బల్దియా హై… రామగుండం నగర పాలక సంస్థకు ఈ పేరు చక్కగా సరిపోతుందని పలువురు అంటున్నారు. ఎందుకంటే వాహనాల కొనుగోళ్లలో చూపుతున్న శ్రద్ధ, వాటి వినియోగంలో మాత్రం చూపించడం లేదు. కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు కుమ్మక్కుతో నగర పాలక సంస్థ పట్టణ ప్రగతి, 14వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులను దుబారా చేస్తున్నారన్న విమర్శలు లేకపోలేదు.
జిల్లాలోనే ఏకైక కార్పొరేషన్ రామగుండం ఒక్కటే. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్టుగా… ఇక్కడ పారిశుధ్య నిర్వహణ నిమిత్తం కొనుగోలు చేస్తున్న వాహనాలు కొంత కాలానికే స్క్రాప్ గా మారుతున్నాయి. పట్టణ ప్రగతి ద్వారా కొనుగోలు చేసిన ఆటో ట్రాలీలు, డస్ట్ బిన్ లు , ట్రాక్టర్లు కార్యాలయం వెనుకాల తుప్పు పట్టి చెదలు పడుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలో చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లు సైతం ఇప్పుడు కార్యాలయం వెనుకాలే స్క్రాప్ కింద అమ్మేందుకు కూడా పనికి రాకుండా పోతున్నాయి.
వాహనాల వినియోగంలో కావాలనే నిర్లక్ష్యం చేయడం వల్ల కొనుగోలు చేసిన కొద్ది కాలానికే నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని ట్రాక్టర్లలో బ్యాటరీలు దొంగల పాలై అవి నడవక నిరుపయోగంగా వదిలేస్తున్నారు. మరికొన్ని వాహనాలు సరైన సమయంలో మరమ్మతులు చేయకపోవడంతో స్క్రాప్ గా మారుతున్నాయి. ఇలా ప్రతి ఏటా వాహనాలు కొనుగోలు చేయడం వాటిని మూలకు పడేయడం పరిపాటిగా మారుతోంది. నూతన వాహనాల కొనుగోళ్లకు మళ్లీ టెండర్లు పిలవడం కాంట్రాక్టర్ల జేబులు నింపడం అనవాయితీగా వస్తోంది. కనీసం స్క్రాప్ కింద వాటిని అమ్మకానికి పెట్టినా నగర పాలక సంస్థకు ఎంతోకొంత ఆదాయం సమకూరుతుందని కూడా ఆలోచించడం లేదు.