lones Interviews | కోల్ సిటీ , ఏప్రిల్ 24: అయ్యయ్యో.. ఎంతటి గోస.. ఏమిటీ ప్రయాస.. రుణాలు దేవుడెరుగు.. అంతటి ఎండలో ఏమైనా జరిగితే ఎవరిదీ బాధ్యత.. అధికారుల నిర్లక్షానికి కాదా ఈ పరాకాష్ట.. రామగుండం నగర పాలక సంస్థలో సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రెండో రోజు కూడా మాడు పగిలే మండుటెండలో అపసోపాలు పడాల్సి వచ్చింది. గురువారం ఎస్బీఐ మున్సిపల్ శాఖ, జల్లారం, జ్యోతినగర్ శాఖ బ్యాంకుల పరిధిలోని అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిచారు. పిల్లా, పాపలతో వచ్చిన మహిళలు మండుటెండలో ఉక్కపోత తో అరిగోస పడాల్సి వచ్చింది.
మున్సిపల్ శాఖ, జ్యోతినగర్ శాఖ పరిధిలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు మండుటెండలోనే మహిళలు, యువతులు గంటల పాటు నిలబడాల్సి వచ్చింది. గురువారం సైతం అధికారుల పర్యవేక్షణ లేక ఇంటర్వ్యూల ప్రక్రియ ఆలస్యంగా సాగుతూ వచ్చింది. కొంతమంది అభ్యర్థులు ఎండకు అలసి సొలసి టెంట్ల కిందనే కాసేపు సేద తీరుతూ కనిపించారు. కొంతమంది అభ్యర్థులు దళారుల సాయంతో ఇంటర్వ్యూలకు హాజరైనట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం ఇస్తామని చెప్పిన రుణాలకు దరఖాస్తు చేసుకుంటే బ్యాంకర్లు ఇంటర్వ్యూలు చేయడం వల్ల అంత సులువుగా రుణాలు వస్తాయా? అంటూ అభ్యర్థులు సందేహాలను సందించారు.