కరీంనగర్ కార్పొరేషన్/ ముకరంపుర, మే 26: ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. మంగళవారం రాత్రి అక్కడక్కడా ప్రతాపం చూపింది. ఈదురుగాలుల ప్రభావంతో నగరంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. సాయంత్రం తర్వాత ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై, గాలి దుమారం మొదలైంది. అధిక వేగంతో గాలి వీయడంతో దుమ్ము ధూళి ఎగిసిపడి, రోడ్లపై ఏమీ కనిపించని పరిస్థితి నెలకొంది. దీంతో జనం ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇదే సమయంలో ఎత్తయిన భవనాలు, రోడ్ల వెంట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఎక్కడికక్కడ చిరిగిపోయి విద్యుత్తీగలపై పడి పోయాయి.
ప్రధానంగా జగిత్యాల, పెద్దపెల్లి, మంచిర్యాల, వేములవాడ ప్రధాన రహదారుల వెంట ఫ్లెక్సీలు తీగలపై అధికంగా పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గంటలపాటు నగరంలో చీకట్లు కమ్ముకున్నాయి. సవరన్ స్ట్రీట్లో ఓ ఎల్టీ స్తంభం విరిగి విద్యుత్ తీగలు తెగిపోయాయి. బొమ్మకల్ ప్రాంతంలో 11 కేవీ స్తంభాలు విరిగిపోవడంతో లైన్లు దెబ్బతిన్నాయి. కలెక్టరేట్ ఆవరణలో ఓ చెట్టు విరిగి పడడంతో తీగలు తెగిపోయాయి. విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో తీగలపై పడిన ఫ్లెక్సీలు, చెట్ల కొమ్మలను తొలగించేందుకు శ్రమించినా, అర్ధరాత్రి వరకు కూడా కొన్ని ప్రాంతాలు అంధకారంలోనే ఉన్నాయి.

కరీంనగర్: సవరన్ స్ట్రీట్లో నేలకొరిగిన స్తంభం.. కూలిన గోడ