Korutla Municipal Commissioner | కోరుట్ల, జూలై 14: తడి, పొడి, హనికరమైన చెత్తను వేరు చేసి ఇళ్ల వద్దకు వచ్చే మున్సిపల్ పారిశుధ్య వాహన సిబ్బందికి అందించాలని మున్సిపల్ కమిషనర్ రవీందర్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన వంద రోజుల కార్యచరణ స్వచ్ఛత పనులను ఆయన సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తడి, పొడి చెత్తపై కాలనీవాసులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
డ్రైనేజీల్లో ఎలాంటి చెత్తను వేయవద్దన్నారు. మురుగునీరు సాఫీగా వెళ్లేందుకు పారిశుధ్య పనులు చేపట్టినట్లు తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా దోమలు వృద్ధి చెందకుండా ముందస్తూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాలనీల్లో రహదారుల వెంబడి పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్లపొదలను జేసీబీ బ్లేడ్ వాహనంతో శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయన్నారు.
భవన నిర్మాణాల కూల్చివేతలో వచ్చే మట్టి, కాంక్రీట్ సేకరించి రహదారిపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి వేస్తున్నట్లు తెలిపారు. పట్టణ పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, వార్డు ఆఫీసర్లు, జవాన్లు పాల్గొన్నారు.