పెద్దపల్లి, జనవరి9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు వ్యవసాయాన్ని పండుగలా చేసింది. 24 గంటల కరెంట్, సాగునీరు, రైతుబంధు ఇవ్వడంతో సాగు సంబురంగా సాగుతున్నది. పుట్లకొద్దీ ధాన్యం పండుతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో రైతులు ఎక్కడా ఒక్క ఎకరం ఖాళీ ఉంచకుండా పంటలు వేస్తుండగా, వ్యవసాయ రంగంలో ఉపాధి పుష్కలంగా పెరిగింది. ఇదే సమయంలో స్థానికంగా కూలీల కొరత కూడా ఏర్పడింది. దీంతో దేశంలోని ఇతర రాష్ర్టాల నుంచి కూలీలు పెద్ద సంఖ్యలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు వస్తున్నారు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, బిహార్, ఆంధ్రప్రదేశ్ నుంచి తమ కుటుంబాలతో వచ్చి ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా వరి నాట్ల పనుల్లో తలమునకలయ్యారు.
పెద్దపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్, ముత్తారం, ఎలిగేడు మండలాలకు 300 మంది తరలివచ్చి, బృందాలుగా ఏర్పడి నాట్లు వేస్తున్నారు. రైతుల వద్ద ఎకరానికి 3,200 నుంచి 3,500 చొప్పున గుత్తకు మాట్లాడుకొని చకచకా పనిచేస్తున్నారు. పెద్దపల్లి జిల్లాకు వచ్చిన కోల్‌కతాకు చెందిన కూలీలను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించగా, తమ మనోభావాలను ఇలా ఆవిష్కరించారు. తమ రాష్ర్టాల్లో ఉపాధి అవకాశాలు తక్కవేనని, రోజంతా కష్టపడినా పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. ఇక్కడ మాత్రం తమకు రోజుకు 600 నుంచి 800 దాకా కూలి వస్తున్నదని మురిసిపోతున్నారు.
మాకు పని సులువైతంది
బెంగాల్ కూలీలు రాబట్టి మా పని కొంచెం సులువైతున్నది. నాట్లు వేయాలంటే చాలా తిప్పలయ్యేది. ఇప్పుడు ఆ బాధ లేదు. ఊర్లళ్ల ఉన్న కూలీలు సరిపోవడం లేదు. వీళ్లు రావడం వల్ల త్వరగా నాట్లు అవుతున్నయి. మా ఊరికి ఐదు బ్యాచ్‌లు వచ్చినయి. ఇంకో ఆరేడు వస్తాయట. మూడేండ్ల నుంచి వీళ్లు వస్తున్నరు. వీళ్లు నాటేసే పద్ధతి బాగా ఉంటుంది. నాటు మంచిగా పడుతుంది. పని త్వరగా అవుతుంది. వీళ్లకు వసతి కల్పిస్తే సరిపోతుంది. వాళ్లే వండుకుంటరు.
– కనపర్తి ప్రభాకర్‌రావు, రాంపల్లి (పెద్దపల్లి మండలం)
మాకు చేతినిండా పని..
మాది కలకత్తాలోని చక్దా ఏరియా. మా రాష్ట్రంలో కూలీ పనులు ఎక్కువ దొరుకవు. అందుకే ఇక్కడికి వచ్చి కూలీ పని చేసుకుంటున్నం. మేం 50 మందిమి వచ్చినం. ఈ నెల రోజులు మాకు చేతి నిండా పని దొరుకుతది. ఇక్కడ సంపాదించిన పైసలే మమ్ముల ఏడాదంతా కాపాడుతయి.
– కృష్ణ, వ్యవసాయ కూలీ (కోల్‌కతా)
మూడేండ్ల నుంచి ఇక్కడికి వస్తున్నం
మేం ఎక్కడ ఏ కూలీ పని దొరికితే ఆ పని చేసుకుంటం. మూడేండ్ల నుంచి ఇక్కడికి వస్తున్నం. 12 రోజుల కింద 60 మందిమి వచ్చినం. 12మందికి ఒక బ్యాచ్‌గా తయారైనం. పొలాలు గుత్తకు తీసుకొని నాట్లు వేస్తున్నం. మాకు ఎకరానికి 3,200 ఇస్తున్నరు. రోజుకు మూడు, నాలుగు ఎకరాలు వేస్తున్నం. మాకు ఒక్కరికి రోజుకు 800 దాకా దొరుకుతున్నయి.
– అశోక్ సర్దార్, వ్యవసాయ కూలీ (కోల్‌కతా)