Minister Adluri | జగిత్యాల, ఆగస్టు 20 : వరదల్లో గల్లంతై మృతి చెందిన జగిత్యాల జిల్లా వాసుల కుటుంబాలను రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బువారం పరామర్శించారు. జగిత్యాలలోని టీఆర్ నగర్ 47, 48వ వార్డులకు చెందిన హసీనా, సమీనా, ఆఫ్రిన్ మహిళలు మహారాష్ట్ర నుండి తిరిగి వస్తుండగా ఉద్గిర్ జిల్లా కేంద్రం సమీపంలో వరదల్లో గల్లంతై మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దైవ క్షేత్ర దర్శనాలకు వెళ్లి తిరిగి వస్తున్న సందర్భంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమన్నారు.
మరణించిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే సహాయంతో పాటు ముఖ్యమంత్రితో మాట్లాడి ఆర్థిక సహాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఈ కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. బాబుకు మెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. మరణించిన కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి మైనార్టీ వెల్ఫేర్ నుండి రుణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. మరో మహిళ ఆచూకీ కోసం అక్కడి అధికారులతో మాట్లాడి తొందరలోనే ఆ మహిళ ఆచూకీ కూడా తెలిసే విధంగా చర్యలు చేపడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కుటుంబాలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జిల్లా రవి, తిరుపతి సిరాజ్, నాగేంద్ర తదితర నాయకులు ఉన్నారు.