Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, సెప్టెంబర్ 08 : బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల సంక్షేమానికి పాటుపడాల్సిన సంక్షేమ శాఖ జిల్లాలో సంక్షోభం దిశగా అడుగులు వేస్తోందా అంటే ఆశాఖ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. గత కొన్నాళ్ళుగా అధికారులు, సిబ్బంది మద్య సమన్వయం కొరవడగా, జిల్లాలో విద్యార్థుల సంక్షేమం వెనుకబడుతోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధికారి, సిబ్బంది మధ్య తమ పిల్లలు నలుగుతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. అయిన వారికి ఆకుల్లో… కాని వారికి కంచాల్లో అన్నట్లుగా ఆశాఖ అధికారి వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలుండగా, అనేక మంది కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు బాహాటంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నా… అనుకున్న వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ, మిగతా వారిపట్ల అనుచితంగా ప్రవర్తించటం అశాఖలో షరా మామూలే అన్నట్లుగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఆధిపత్య ధోరణితో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ, విద్యార్థుల సంక్షేమానికి కేటాయిస్తున్న సొమ్ము దుర్వినియోగమవుతున్నా, చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంపై మండిపడుతున్నారు.
తాను చెప్పింది వింటే ఓకే.. లేకుంటే వేధింపులు తప్పవని పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారమిస్తూ, పలు హాస్టళ్ళు ఎత్తివేయించి బలహీన వర్గాల విద్యార్థులకు సంక్షేమ ఫలాలు అందకుండా అడ్డుపడుతున్నాడని పలు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. తన మాటకు మద్దెల కొట్టే వారికి హాస్టళ్ళలో సీట్ల సంఖ్య పెంచటం, ప్రశ్నించే వారు విధులు నిర్వహిస్తున్న చోట సీట్ల సంఖ్య కుదిస్తూ, కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నట్లు పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారి వ్యవహారశైలి ఆనోటా ఈ నోటా కలెక్టర్ దృష్టికి వెళ్ళినా ఆ అధికారి పట్టించుకోకుండా విపరీత ధోరణి ప్రదర్శిస్తుండటంతో, కిందిస్థాయి సిబ్బంది తీవ్ర మనస్థాపానికి గురవుతున్నట్లు ఆశాఖ వర్గాల ద్వారా తెలుస్తోంది. కొంతమంది సిబ్బంది దీర్ఘకాలిక సెలవులు పెట్టేందుకు సిద్ధమవుతుండగా, ఉద్యోగ సంఘాల నాయకులు వారిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల హుజురాబాద్ డివిజన్ పరిధిలోని ఓ పట్టణంలో విద్యార్థుల వసతి గృహం శిథిలావస్థకు చేరినట్లు, అందులోని విద్యార్థుల కోసం ప్రైవేట్ భవనం అద్దెకు తీసుకోవాలని కలెక్టర్కు సమాచారమివ్వగా, సదరు అధికారి గురించి ముందే తెలిసిన కలెక్టర్ మరునాడు క్షేత్రస్థాయిలో పరిశీలించి, కొద్దిపాటి మరమ్మత్తులు చేస్తే అదే భవనాన్ని వినియోగించుకోవచ్చని, వెంటనే రిపేర్లు చేయాలని సంబంధితాధికారులను ఆదేశించినట్లు సమాచారం. దీంతో, ఉన్నతాధికారి వద్ద పట్టు సడలుతుండగా, దానిని కిందిస్థాయి సిబ్బందిపై ప్రదర్శిస్తుండటంతో, సిబ్బందికి ఆయనకు మద్య రోజురోజుకు అంతరం పెరుగుతున్నట్లు ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రభావం విద్యార్థుల సంక్షేమంపై పడుతుండగా, వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నదనే చర్చ ఆశాఖ సిబ్బందిలో కొనసాగుతున్నది. ఉన్నతాధికారులు దీనిపై స్పందించి బడుగు విద్యార్థులకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు చేపట్టాలని బిసి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.