Minister Ponnam Prabhakar | చిగురుమామిడి, అక్టోబర్ 30 : తుఫాన్ ప్రభావంతో వరి, మొక్కజొన్న పంటను నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని, రైతన్నలు ఎవరూ అధైర్య పడొద్దని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడి మండలంలోని సీతారాంపూర్, ఇందుర్తి గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంటలు, ఇందుర్తి కోహెడ మధ్య ప్రవహిస్తున్న ఎల్లమ్మ వాగును గురువారం పరిశీలించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ చాలాకాలంగా ఇందుర్తి నుండి కోహెడ వంతెన పూర్తిగా దెబ్బతిందని, హై లెవెల్ బ్రిడ్జి మంజూరు చేస్తానన్నారు. మండల అధికారులు అప్రమత్తంగా ఉండడం వల్లే ఎలాంటి ప్రమాదాలు జరగలేదనన్నారు. సీఎం జిల్లా పర్యటనలో భాగంగా బ్రిడ్జి ఏర్పాటుపై ప్రిపరేషన్ అందజేస్తామన్నారు. కరీంనగర్ సిద్దిపేట జిల్లా సరిహద్దు మధ్య ఉన్న ఈ వంతెన రెండు జిల్లాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. వరదల ద్వారా నష్టపోయిన రోడ్లు, పంటల నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు తరతకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. మండలంలో కూలిన విద్యుత్ స్తంభాలు, దెబ్బతిన్న పంటలను, ఆస్తి నష్టం పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద ప్రవాహంతో వరి పొలాల్లో పూర్తిగా ఇసుక బీటలు వేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వారికి అన్ని విధాల న్యాయం చేస్తామన్నారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాంఖడే, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీవో కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, నాయకులు ఉన్నారు.