CITU | గోదావరిఖని : సింగరేణి సంస్థలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోసం యువ కార్మికులు యాజమాన్యాన్ని ప్రశ్నించేలా వారిని తయారు చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. గోదావరిఖనిలో యువ కార్మికుల శిక్షణా తరగతుల్లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను చైతన్యవంతం చేయడం ద్వారా అపరిస్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని కార్మిక సంఘాలు ఈ దిశగా ముందుకు వెళ్లాల్సి ఉండగా కొన్ని కార్మిక సంఘాలు కార్మికులను ముఖ్యంగా యువ కార్మికులను తప్పుదోవ పట్టిస్తూ పైరవీలను ప్రోత్సహిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ ల వల్ల కార్మికులు భవిష్యత్తులో సమ్మె చేయకుండా అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని, హక్కుల రక్షణ కోసం పోరాటాలు చేయడానికి యువ కార్మికులు ముందు వరుసలో ఉండాలని ఆయన కోరారు. భవిష్యత్ లో యువ కార్మికుల వల్లనే సింగరేణి సంస్థ మనుగడ సాధిస్తుందని, సంస్థలు ఇప్పుడు గోప్యత పాటిస్తూ లాభాలను సైతం సక్రమంగా చూపించడం లేదని ఆయన ఆరోపించారు. కార్మికుల హక్కుల సాధన కోసం సీఐటీయూ నిరంతరం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి, మంద నరసింహ రావు, బ్రాంచ్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఎస్ వెంకటస్వామి, బ్రాంచ్ సెక్రటరీలు మండ శ్రీనివాస్, కుంట ప్రవీణ్, దొమ్మేటి కొమురయ్య, గుల్ల బాలాజీ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.