Vodithela Pranav | హుజురాబాద్ టౌన్, జూలై 11: అర్హులైన ప్రతీ నిరుపేదకు దఫాల వారిగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ పట్టణ, మండల పరిధిలోని 39 మంది లబ్ధిదారులకు సుమారు రూ.16 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42శారం రిజర్వేషన్ క్యాబినెట్లో ఆమోదించిందని అన్నారు.
ఈ సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే 3500 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశామని, దఫలవారీగా అందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేలా కేటాయిస్తామని, సాంకేతిక కారణాల వల్ల ఆగిన ఇళ్లను కూడా అందజేస్తామని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మరమ్మతులు చేయించి త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నియోజకవర్గంలో సుమారు 3500 కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తుందని, అందుకే ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని అన్నారు. త్వరలో రానున్న స్ధానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.