కార్పొరేషన్, డిసెంబర్ 30: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో శుక్రవారం ఉదయం మేయర్ యాదగిరి సునీల్ రావు అధ్యక్షతన నిర్వహించిన బల్దియా సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది. ఈ సమావేశంలో 95 ఎజెండా అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం స్టడీ అవర్ సమయంలో అల్పాహారం అందించేందుకు ‘విద్యార్థి చేయూత’ పథకం పేరిట సభాధ్యక్షుడు మేయర్ యాదగిరి సునీల్ రావు తీర్మానం ప్రవేశపెట్టడంతో పాలకవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో పాలకవర్గ సభ్యులు తమ తమ డివిజన్లలో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. సభ్యులు డివిజన్ల వారీగా లేవనెత్తిన సమస్యలపై సభలో చర్చించారు. సమస్యలను పరిషరించాలని బల్దియా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సర్వసభ్య సమావేశం అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి ముగించారు.
వేసవిని దృష్టిలో పెట్టుకొని మంచినీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు మేయర్ సునీల్ రావు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవర్ సమయంలో అల్పాహారం అందించేందుకు నగరపాలక సంస్థ విద్యార్థి చేయూత పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఈ పథకాన్ని సర్వసభ్య సమావేశంలో పాలకవర్గ సభ్యుల ఆమోదంతో ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్పొరేషన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 700 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని, చేయూత పథకానికి బల్దియా ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. పాలకవర్గ సభ్యులు సభ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిషరించి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైనేజీలు, పారులు, శ్మశానవాటికల అభివృద్ధితో పాటు మెరుగైన పారిశుధ్య నిర్వహణ, రోజు మంచినీటి సరఫరా చేస్తామన్నారు. అభివృద్ధి పనుల పర్యవేక్షణ, వాటి వేగవంతం, సభ్యులు విన్నవించిన సమస్యల పరిషారంపై అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నగరంలో ప్రధాన సమస్యగా మారిన పందులు, కోతులు, కుకల బెడదపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. పందుల పెంపకందారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించి వీధుల్లో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.
నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి కోతులను పట్టే కార్యక్రమం డివిజన్ల వారీగా కొనసాగుతున్నట్లు తెలిపారు. కోతులను పట్టి సుదూర ప్రాంతంలో వదులుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఉన్న కుకలకు ఇప్పటికే పశు వైద్యశాలలో బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయించామన్నారు. వేసవిలో మంచినీటి సరఫరాలో ఇబ్బందులు కలుగకుండా నగరపాలక సంస్థ ద్వారా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మంచినీటి సరఫరాలో చిన్న చిన్న సమస్యలు వస్తే వెంటనే పరిషరించాలని అధికారులను ఆదేశించారు. మంచి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా నీటి శుద్ధీకరణ కేంద్రంతో పాటు కోర్టు, మారెట్ రిజర్వాయర్లలో స్టాండ్ బై మోటర్లు ఏర్పాటు చేసుకోవడంతో పాటు పవర్ కట్ సమయాల్లో జనరేటర్లను కూడా ఉపయోగించేలా చూడాలన్నారు. ఎంబీఆర్ నుంచి అన్ని రిజర్వాయర్లు, సంపులు నిండుకునేలా చూడాలని అధికారులకు సూచించారు. నగరంలో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాక్టర్లు, ఆటో రిక్షాలకు మరమ్మతులు చేపట్టి చెత్త సేకరణలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇంటింటా చెత్త సేకరణతో పాటు రోడ్లు, ఇండ్ల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి, పనులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాలకవర్గ సభ్యులు విన్నవించిన సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరగా పరిషరించాలని సూచించారు. డివిజన్లలో చేపట్టే అభివృద్ధి పనులకు సామగ్రి ఉంటేనే భూమి పూజ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో పెండింగ్‌లో ఉన్న పారు పనులను త్వరగా పూర్తి చేసేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచాలన్నారు. అభివృద్ధి చేసిన పారుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం కోసం మరో 30 ఓపెన్ జిమ్‌లను త్వరలో ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశామన్నారు. వచ్చే సర్వసభ్య సమావేశాన్ని నగరపాలక సంస్థ కార్యాలయంలోని నూతన సమావేశ మందిరంలో జరుపుకొంటామని పాలకవర్గ సభ్యులకు తెలిపారు. నూతన సమావేశ మందిరం పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులు కాంట్రాక్టర్‌పై ఒత్తిడి పెంచాలన్నారు. 15 రోజుల్లో పనులు పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ సహకారంతో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, పాలకవర్గ సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.