Ponnam Prabhakar | కమాన్ చౌరస్తా, జనవరి 12 : కరీంనగర్ మార్కెట్ రోడ్డు లోని శ్రీ లక్ష్మీ,పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈనెల 23 నుండి 30 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల సన్నాహక సమావేశం జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఈ సంవత్సరం మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు ప్రశాంతంగా స్వామి వారి దర్శనం చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని, పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులంతా బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. గతేడాది మాదిరిగానే స్వామివారి సేవకు ముందుకు వచ్చి విరాళాలు సమర్పిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వేడుకలు నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ అధికారులతో వివిధ శాఖలు సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని సూచించారు.
కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుంటుందని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ స్వామివారి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని అన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు ఆలయ పరిసరాల్లో శానిటేషన్, క్లీనింగ్ సమస్యలు రాకుండా చూస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు దాతలు బ్రహ్మోత్సవాల నిర్వాహణకు విరాళాలను ప్రకటించారు. ఈ సమావేశంలో ఆర్డీవో మహేశ్వర్, కరీంనగర్ కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్రె రాజశేఖర్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఆలయ చైర్మన్లు చకిలం శ్రీనివాస్, చకిలం గంగాధర్, ఏసీపి వెంకటస్వామి, ఈవో సుధాకర్ పాల్గొన్నారు.