హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): చట్టబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, అధికారులు పక్షపాత ధోరణితో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ఈ ధోరణితోనే మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ను అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని మండిపడ్డారు. ఆయన అరెస్టు అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసుకొనే అవకాశం ఇవ్వకుండా, బెదిరింపులకు గురిచేస్తూ, వారిని లోబరుచుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకున్నందుకే బాల్క సుమన్‌ను అక్రమ కేసుల్లో ఇరికించారని ఆరోపించారు. హక్కులను కాపాడాల్సిన మంత్రి వివేక్ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజల తరఫున నిలబడిన బాల్క సుమన్‌కు తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.