కొలంబో : టీ20 ప్రపంచకప్‌లో అందరి అంచనాలను తలకిందులు చేస్తున్న జింబాబ్వే మరో సంచలనాన్ని నమోదుచేసింది. ఈ టోర్నీలో ‘అండర్ డాగ్స్’గా బరిలోకి దిగి అగ్రశ్రేణి జైట్టెన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన ఈ ఆఫ్రికన్ జట్టు.. ఓటమన్నదే లేకుండా లీగ్ దశను ముగించింది. గురువారం కొలంబో వేదికగా గ్రూప్-బీలో ఆతిథ్య శ్రీలంకతో ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన హోరాహోరీ పోరులో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. లంకేయులు నిర్దేశించిన 179 పరుగుల ఛేదనను మరో 3 బంతులుండగానే 4 వికెట్లు మాత్రమే నష్టపోయి దంచేసింది. ఈ టోర్నీలో అజేయంగా నిలుస్తూ సత్తాచాటుతున్న బ్రియాన్ బెన్నెట్ (48 బంతుల్లో 63 నాటౌట్, 8 ఫోర్లు) వరుసగా రెండో అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకోగా కెప్టెన్ సికందర్ రజా (26 బంతుల్లో 45, 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇన్నింగ్స్‌తో ఆ జట్టును గెలిపించాడు. మరుమణి (34), బర్ల్ (23) కూడా గెలుపులో తలో చేయి వేశారు. అంతకుముందు లంక.. మొదట బ్యాటింగ్ చేసి గత మ్యాచ్ సెంచరీ హీరో పతుమ్ నిస్సంక (41 బంతుల్లో 62, 8 ఫోర్లు), పవన్ రత్నాయకె (25 బంతుల్లో 44, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరవడంతో 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 178 రన్స్ చేసింది. కాగా జింబాబ్వేకు టీ20ల్లో ఇది రెండో అత్యుత్తమ ఛేదన (మొదటిది నమీబియాపై 199) కావడం గమనార్హం.
రికార్డు ఛేదనను జింబాబ్వే ధాటిగానే ఆరంభించింది. ఓపెనర్లు 69 పరుగులు జోడించి ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బెన్నెట్.. ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. తీక్షణ ఓవర్లో మరుమణి రెండు బౌండరీలు కొట్టగా అతడి మరుసటి ఓవర్లోనూ ఓ సిక్స్ బాదాడు. బెన్నెట్ కూడా ఇదే ఓవర్లో రెండు బంతులను బౌండరీకి తరలించాడు. వెల్లలాగె 9వ ఓవర్లో మరుమణిని ఔట్ చేసినా ర్యాన్ బర్ల్ ఉన్నది కొద్దిసేపే అయినా 2 బౌండరీలు, ఓ సిక్స్‌తో అలరించాడు. బర్ల్ నిష్క్రమణ తర్వాత వచ్చిన రజా.. క్రీజులో కుదురుకున్నాక లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆఖరి 6 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 65 రన్స్ అవసరమవగా స్పిన్నర్ హేమంత వేసిన ఓవర్లో 6, 6, 4 బాది 20 రన్స్ రాబట్టాడు. తీక్షణ ఓవర్లోనూ సిక్స్, ఫోర్ కొట్టాడు. ధాటిగా ఆడే క్రమంలో అతడు నిష్క్రమించినా జింబాబ్వే విజయం అప్పటికే ఖాయమైంది. అర్ధ శతకం తర్వాత బెన్నెట్ వేగం పెంచి మున్యొంగ (8*) అండతో లాంఛనాన్ని పూర్తిచేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ (48*, 64*, 63*) బెన్నెట్ ఔట్ కాకపోవడం విశేషం.
శ్రీలంక: 20 ఓవర్లకు 178/7 (నిస్సంక 62, రత్నాయకె 44, క్రీమర్ 2/27, ఎవాన్స్ 2/35);
జింబాబ్వే: 19.3 ఓవర్లలో 182/4 (బెన్నెట్ 63*, రజా 45, హేమంత 2/36, శనక 1/26)