భారత సాగురంగానికి ఆయువుపట్టులాంటి ఖరీఫ్‌కు కష్టకాలం తప్పదని తేలిపోయింది. వానకాలం సాగుపై నైరుతి దెబ్బకొట్టింది. ఎల్ నినో ఎఫెక్ట్‌తో ఈసారి వర్షాకాలం 15శాతం లోటుతో ముగిసింది. ఈ ఏడాది 32 రోజులే వానలు కురువగా, ఈ నెల ప్రారంభం నుంచి పరిస్థితి మరీ దయనీయంగా మారింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రజలకు, వ్యవసాయ రంగానికి ప్రధాన ఆయువుపట్టుగా నిలిచే నైరుతి రుతుపవనాల కాలం ముగింపు దశకు చేరుకున్నది. సీజన్ ఆరంభం నుంచి చివరివరకు ఆశించినస్థాయిలో వానలు కురువకపోవడంతో ఈ ఏడాది నైరుతి కాలం రాష్ట్రంలో తీవ్ర నిరాశనే మిగిల్చింది. చివరిదశలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురిసిన విస్తారమైన వర్షాలు కొంతమేర ఊరటనిచ్చాయి. వాతావరణ శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించిన విధంగా ఎల్ నినో ప్రభావం ఈ సీజన్‌పై తీవ్రంగా పడింది. రుతుపవనాల గమనం నెమ్మదించడంతో పాటు బంగాళాఖాతంలో అనుకూల వాతావరణ వ్యవస్థలు సరిగ్గా ఏర్పడకపోవడంతో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఎకువకాలం పొడి వాతావరణమే ఉన్నది. మొత్తం సీజన్ వర్షపాతం గణాంకాలను పరిశీలిస్తే జూన్ 1 నుంచి సీజన్ ముగిసే సమయానికి తెలంగాణలో సాధారణంగా 718 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 612 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా నికరంగా 15 శాతం మేర లోటు వర్షపాతం నమోదైంది.
వర్షాకాలపు రోజుల(రెయినీ డేస్) పరంగా చూస్తే ఈ సీజన్ అత్యంత బలహీనంగా నిలిచింది. సాధారణంగా నాలుగు నెలల (122 రోజులు) నైరుతి కాలంలో సగటున 45 నుంచి 50 వరకు విస్తారమైన వర్షపు రోజులు నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 30 నుంచి 32 రోజులకే పరిమితమయ్యాయి. సీజన్ మధ్యలో వరుసగా 15 నుంచి 20 రోజులపాటు సుదీర్ఘ పొడి వాతావరణం(డ్రైస్పెల్స్) కొనసాగడం వల్ల భూగర్భ జలాలు పడిపోయి వానకాలం పంటలపై ప్రభావం పడింది. సెప్టెంబర్ 1 నుంచి 22వ తేదీవరకు రాష్ట్రవ్యాప్తంగా 130 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, కేవలం 86.5 మి.మీ మాత్రమే కురిసింది. అలాగే జూన్ 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు 704 మి.మీ. కురువాల్సి ఉండగా కేవలం 560 మి.మీ. మాత్రమే పడింది. దీంతో సెప్టెంబర్ 22వ తేదీ నాటికి రాష్ట్రంలో వర్షపాత లోటు ఏకంగా 34 శాతానికి చేరుకుని కరువు ఆందోళనలను తీవ్రతరం చేసింది. అటువంటి క్లిష్ట సమయంలో బంగాళాఖాతంలో అనూహ్యంగా ఏర్పడిన తీవ్ర వాయుగుండం రాష్ట్రానికి తాతాలికంగా పెద్ద ఊరటనిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల్లో సగటున 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఫలితంగా అంతకుముందు 34 శాతంగా ఉన్న సెప్టెంబర్ నెల వర్షపాత లోటు ఒకసారిగా 4 శాతానికి పడిపోయింది. ఈ నెల సాధారణ సగటు 145 మి.మీ. కాగా, తాజా వర్షాలతో 139 మి.మీ. వర్షపాతం నమోదైంది. మొన్నటివరకు రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 18 జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం కొనసాగగా, చివరి నాలుగు రోజుల వర్ష ప్రభావంతో ఆ సంఖ్య 14 జిల్లాలకు తగ్గింది. అయితే రాష్ట్రంలోని ఏ ఒక జిల్లాలోనూ సాధారణం కంటే అధిక లేదా అత్యధిక వర్షపాతం నమోదు కాకపోవడం ఈ సీజన్ ప్రతికూలతను స్పష్టం చేస్తున్నది. తెలంగాణలో గత 50 ఏండ్ల చరిత్రను పరిశీలిస్తే.. 1987, 2002, 2009 , 2014-15లో ఇలాంటి కరువు పరిస్థితులు సంభవించినట్టు వాతావరణ రికార్డులు చెప్తున్నాయి. ముఖ్యంగా 2002లో జూలై నెలంతా సుదీర్ఘమైన డ్రైస్పెల్ కొనసాగి దాదాపు 32 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా, 2015లోనూ ఎల్ నినో కారణంగా రుతుపవనాలు మందగించి ప్రభుత్వం 230కి పైగా మండలాలను అధికారికంగా కరువు ప్రాంతాలుగా ప్రకటించాల్సి వచ్చింది.
చివరి వర్షాలు తూర్పు జిల్లాలకే పరిమితం కావడంతో జోగుళాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ తదితర దక్షిణ, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని పలు మండలాల్లో డ్రైస్పెల్ ప్రభావం వల్ల వానకాలం పంటలు ఎండుముఖం పట్టి కరువు ఛాయలు కొనసాగుతున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి, నల్లగొండ జిల్లా కేతేపల్లి వంటి మండలాల్లో 70 శాతానికి పైగా వర్షపు లోటు రికార్డయింది. తీవ్ర వాయుగుండం ప్రభావం తగ్గిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పడుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణంతో పాటు తీవ్రమైన ఉకపోత, ఎండలు ఉంటాయని, కేవలం కొన్ని జిల్లాల్లో మాత్రమే అకడకడా మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు స్పష్టం చేశారు.