కొండాపూర్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మణిహారంగా ఉండేది. విదేశాల నుంచి తెప్పించిన ఎల్ఈడీ ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి.. సందర్శకులను ఆకట్టుకునేలా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్వహణ లేక కేబుల్ బ్రిడ్జి కళాహీనంగా మారింది. లైటింగ్ వ్యవస్థను దొంగలు ఎత్తుకెళ్లారు. అధికారులు వాటి స్థానంలో ఫంక్షన్లలో ఉపయోగించే లైట్లకు రంగు కాగితాలను చుట్టి సందర్శకులను మోసం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో సంబంధిత వీడియోలు వైరల్గా మారాయి. నెటిజన్లు సర్కారును తిట్టిపోస్తున్నారు. కాగా, విద్యుత్ అధికారులను వివరణ కోరగా, కేబుల్ బ్రిడ్జి లైటింగ్ సిస్టంను దొంగలు ఎత్తుకెళ్లారని, మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.‘ లైటింగ్ సిస్టంలో ఉపయోగించే లైట్లు జపాన్ నుంచి రావాలి. టెండర్ ప్రక్రియ పూర్తయింది. మరో పది రోజుల్లో వస్తాయి. అప్పుడు యథావిధిగా లైటింగ్ ఏర్పాటు చేస్తాం’ అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయ్ అన్నారు.