కరీంనగర్ కార్పొరేషన్, మే 6 : బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న బండి సంజయ్ బజారు భాష బంద్ చేయాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హితవు పలికారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలను తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఆ వ్యాఖ్యలు వెంటనే వాపస్ తీసుకొని క్షమాపణ అడగాలని సూచించారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లుగా మంత్రిగా పనిచేసి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన కేటీఆర్ కరీంనగర్ వస్తే అడ్డుకుంటామని బెదిరిస్తావా..? అని ఆగ్రహించారు. బిడ్డా.. కరీంనగర్ నీ జాగిర్ కాదని ధ్వజమెత్తారు. నీ పిట్ట బెదిరింపులకు ఎవడూ భయపడడని, తెలంగాణ సమాజం ప్రతి చర్యను గమనిస్తున్నదని, మరో రెండేళ్ల తర్వాత కరీంనగర్ ప్రజలే నిన్ను తన్ని తరిమేసే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు.
కరీంనగర్ జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు రోజుల కింద కరీంనగర్‌లోని ఓ జ్యువెల్లరీలో జరిగిన దోపిడీ ఘటనలో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు కేటీఆర్ వచ్చారని, అప్పడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టారని గుర్తు చేశారు. అయితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కి ఎందుకు నొప్పి వస్తున్నదో తెలియడం లేదన్నారు. ఆయన తన స్థాయి మరిచి చిల్లర భాష మాట్లాడి చిల్లరగాడిగా మారాడని విమర్శించారు. కేటీఆర్ కాందీశీకుల భూముల వ్యవహారం బయట పెట్టగానే ఉలికిపడి, వ్యక్తిగతంగా, పుట్టుక మీద విమర్శలు చేయడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని చెంపలేసుకోవాలని సూచించారు. కరీంనరగ్ పార్లమెంట్ ప్రజలు సంజయ్‌ను నమ్మి ఎంపీగా రెండుసార్లు గెలిపిస్తే, అభివృద్ధి పకన పెట్టి కేవలం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. అసలు నీవు కేంద్ర సహాయ మంత్రివా..? లేక రేవంత్‌కు సహాయ మంత్రివా..? అని ఎద్దేవా చేశారు. నిత్యం హిందువులను రెచ్చగొట్టి ఓట్లు దండుకునే సంజయ్ కొండగట్టు అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చావో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, చొప్పదండి నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.