Godavarikhani | గోదావరిఖని : ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెలమలను టార్గెట్ గా చేస్తూ జాతి పేరుతో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని రామగుండం మున్సిపల్ వెలమ సంఘం నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నేత నడిపెల్లి రామ్మోహన్ రావు హితవు పలికారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
గడచిన రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ప్రతీ సందర్భంలో వెలమలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని, ఇది సరైన విధానం కాదని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విభేదాలు ఉంటే అవి వ్యక్తిగతమైనవి.. ఆ కారణాన్ని చూపుతూ మొత్తం వెలమజాతిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఇకముందు సహించేది లేదని ఆయన పేర్కొన్నారు. రెడ్డిలు వెలమాలు స్నేహితులుగా ఉన్న పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయని కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే ఒక వర్గాన్ని కించపరచడానికి ప్రయత్నించడం ఆయన మూర్ఖత్వమే అవుతుందన్నారు.
తాను నాలుగు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి చేస్తున్న విధానాలు కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బ్రష్టు పట్టించే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్నోసార్లు వెలమజాతి మైనారిటీలో ఉందని తక్కువ మంది ఉన్నారని అనేక ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరింతగా రెచ్చిపోయి వెలమజాతిని నీచంగా చూస్తూ విమర్శలు చేయడం ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి తమను టార్గెట్ గా చేస్తూ విమర్శలు చేయడానికి ఆల్ ఇండియా వెలమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలకు సిద్ధమవుతామని ఆయన తెలిపారు. ప్రతీ రాజకీయ పార్టీలో వెలమలు ఉన్నారని చాలామంది అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించారని ఆ విషయం ఆయనకు తెలియదా? కేవలం రేవంత్ రెడ్డికి ఈ విధంగా ఎందుకు మాట్లాడాలని అనిపిస్తుందో అర్థం కావడం లేదన్నారు.
ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేనట్లయితే వెలమల ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం అవుతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వెలమ సంఘం నాయకులు నడిపెల్లి సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.