Vemulawada | వేములవాడ, మే 1: వేములవాడ పురపాలక సంఘం పరిధిలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి ఫిర్యాదు చేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. వేములవాడలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.2.69 కోట్లతో చేపడుతున్న నాంపల్లి సుందరీ కరణ పనులకు ఇందులో సగం వాటా అమృత్ టు ద్వారా కేంద్రం నిధులు మంజూరు చేసిన అధికారులు ప్రారంభోత్సవానికి కనీస సమాచారం ఇవ్వడం లేదని అన్నారు. కేంద్రం 50శాతం నిధులు వెచ్చిస్తున్న స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ని ఎందుకు ఆహ్వానించడం లేదని వారు ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రతీ అభివృద్ధి పనికి కేంద్రం వాటా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నిధులను దాచిపెట్టి తామే చేస్తున్నట్లుగా చెప్పుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వం పొరపాటు చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదని, నిధులు వెచ్చిస్తున్న కనీస మర్యాద పాటించకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. అధికారులు కేంద్రం నిధులు ఉన్నాయని చెప్పకపోగా కనీసం మంత్రికి కూడా సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్ కు మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారులపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు కుమ్మరి శంకర్, ముత్యం, నాయకులు రేగుల మల్లికార్జున్, సంటి మహేష్, నామాల శేఖర్, హనుమాన్లు, కృష్ణ హరి తదితరులు పాల్గొన్నారు.