చిగురుమామిడి, డిసెంబర్ 23: రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిగురుమామిడి మండలం సుందరగిరి, చిన్న ములనూర్ గ్రామాల్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఆయన సతీసమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు మంత్రికి తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో సతరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని, అందుకు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. మంత్రి వెంట ఆలయ చైర్మన్ గందె సంపత్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు. ములనూర్ ఆలయంలో మంత్రి దంపతులను మాజీ ఎంపీటీసీ ముప్పిడి సంగీత దేవేందర్‌రెడ్డి సతరించారు.