Mayor Mahankali Swamy | కోల్ సిటీ, జూన్ 27 : గోదావరిఖని మార్కెట్ ఏరియాలో 40 ఫీట్ల రోడ్డు నిర్మిస్తామని, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయిస్తే లైసెన్సు రద్దు చేసి మార్కెట్ నుంచి ఖాళీ చేయిస్తామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. ఇటీవల ‘ఇదేనా మార్కెట్ అభివృద్ధి..?’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. ఈ మేరకు ఆయన 39 వ డివిజన్ శివాజీనగర్ కూరగాయల మార్కెట్ ను డిప్యూటీ మేయర్ పీ. ఎల్లయ్య, కార్పొరేటర్ తిప్పారపు మానసతో కలిసి శనివారం సందర్శించారు.
మాంసం దుకాణాల వద్ద నెలకొన్న అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ వాహనాలకు చెత్త ఇవ్వకుండా పురుగులు పట్టేదాకా నిల్వ ఉంచడం, మాంసం వ్యర్థాలను కాలువల పడవేయడం గమనించి మరోసారి జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దుకాణాల ముందు చెత్త, రాళ్లు, ప్లాస్టిక్ కవర్లు, తెరలు, పరదాలు, జాలీలు, శిథిలావస్థలో ఉన్న వస్తువులను తొలగింపచేశారు. నీడ కోసం తాత్కాలిక రేకులు వేసుకోవాలని సూచించారు. పెద్ద కాలువలో పూడిక తొలగించారు. కూరగాయల వ్యర్థాలను మార్కెట్లోనే రీ సైకిలింగ్ చేయడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్ ప్రక్కన 40 అడుగులకు తగ్గకుండా నూతన రోడ్డు నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.