Godavarikhani | కోల్ సిటీ, డిసెంబర్ 6: సమాజ హితమే మా అభిమతమనీ, ఆపదలో ఉన్న వారి జీవితాలకు దారి చూపడమే మా సంకల్ప బలమని స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు ప్రతిన బూనారు. ఈమేరకు గోదావరిఖనిలో ప్రపంచ వాలంటీర్స్ దినోత్సవంను స్వచ్ఛంద సేవకులంతా ఓ చోట కలిసి ఆనందంగా సామూహిక వేడుకగా జరుపుకున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో తమ స్వచ్ఛంద సేవలను స్మరించుకుంటూ కేక్ కట్ చేసి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు పంచుకున్నారు.
సంస్థలు, సభ్యులు వేర్వేరుగా ఉన్నా.. ఎక్కడైనా ఎవరికైనా ఆపదలో ఉన్నారంటే తామున్నామనీ ముందుకు వచ్చి వారి కష్టాల్లో భాగస్వాములుగా సామూహికంగా చేయి చేయి కలిపి బాధితులకు ఆత్మబంధువులుగా ఆపన్నహస్తం అందించడమే తమ లక్ష్యమని ప్రతిజ్ఞ చేశారు. ఒక్క పారిశ్రామిక ప్రాంతంలోనే గాకుండా చుట్టు పక్కల జిల్లాల్లో సైతం తమ స్వచ్ఛంద సేవకుల చేయూత ఎల్లవేళలా ఉంటుందని అభయమిచ్చారు.
పేదలకు నిత్యవసరాలు సమకూర్చడం, పేదింటి యువతులకు దగ్గరుండి పెళ్లిళ్లు చేయడం, అనాథ పిల్లలను తమ కుటుంబ సభ్యులుగా భావించడం, పేద విద్యార్థులకు చేయూత ఇవ్వడమే మా ఐక్య వేదిక లక్ష్యమని ప్రతినిధులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు గోలివాడ చంద్రకళ, దుర్గం నగేశ్, ఐత శివకుమార్, నాగరాజు, రవిగౌడ్, సతీశ్, కొండు రమాదేవి, కట్కూరి శాంతి, కంది సుజాత, ఇమ్మడి శారద, సుశీల, శివానీ, రమాదేవి, బోగే లత తదితరులు పాల్గొన్నారు.