మోర్తాడ్, ఫిబ్రవరి 18: రైతుల సౌకర్యం కోసమని తీసుకొచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అన్నదాతలను ఆగం చేస్తున్నది. కర్షకులకు ప్రయోజనకరంగా ఉంటు ందని ప్రభుత్వం చెబుతున్న యాప్.. వారికి అనేక కష్టాలను తెచ్చిపెడుతున్నది. యూరియా బుకింగ్ కోసం చదువుకున్న వారే ఇబ్బంది పడుతుంటే, చదువుకోని వారి పరిస్థితి మరీ దారుణంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు, సరైన సమయానికి ఓటీపీ రాకపోవడం, చిన్న,సన్నకారు రైతుల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోవడం, కొంత మందిరైతుల వద్ద ఐఫో న్లు ఉన్నా వాటిలో యాప్ డౌన్లోడ్ కాకపోవడం.. ఇలా నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ యాప్ గోల మాకెందుకు.. యూరియా అందుబాటులో ఉంచితే తెచ్చుకుంటమని రైతులు పేర్కొంటున్నారు. పాత పద్ధతిలోనే యూరియా ఇవ్వాలని, లేకపోతే రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు.
గుళికలు అంటగడుతున్నారు..
సొసైటీల్లో యూరియా అందుబాటులో లేకపోవడం రైతులపై అదనపు భారం మోపుతున్నది. మండల కేంద్రాల్లోని ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా బుక్ చేసుకుంటున్న రైతులు.. అక్కడికి వెళ్లిన తర్వాత షాక్కు గురవుతున్నారు. గుళికలు తీసుకుంటేనే యూరియా ఇస్తామని డీలర్లు చెబుతుండడంతో తెల్లముఖం వేస్తున్నారు. యూరియా తప్పనిసరి కావడంతో.. అవసరం లేకపోయినా గుళికలు తీసుకుంటున్నారు. ఇటువంటి విషయాలపై అధికారులు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
కౌలు రైతుల కష్టాలెన్నో..
కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. యూరియా కావాలంటే కౌలుకు ఇచ్చిన రైతు వద్దకు వెళ్లి, అతని ఫోన్లో యూరియా బుక్ చేయించుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. యాప్ విధానం ఇలాగే కొనసాగితే ప్రతిసారీ ఇలా ఇతరులతోనే యూరియాను బుక్ చేయించుకోవాలా అని కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యాప్ సమస్యలెన్నో..
పంటలకు సమయానికి ఎరువులు వేయ డం చాలా కీలకం. పంట కీలక దశల్లో ఎరువులు వేయకుంటే దిగుబడిపై తీవ్ర ప్రభా వం చూపుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతుల సౌలభ్యం కోసమని తీసుకొచ్చిన యాప్ విధానం వారికి ప్రతిబంధకంగా మారింది. ఈ యాప్ కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే డౌన్లోడ్ అవుతుండడంతో ఐఫో న్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఐఫోన్ ఉన్న రైతులు ఇతరులను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మారుమూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఎక్కువ. ఆయా గ్రామాలకు చెందిన రైతులు యూరి యా బుక్ చేయాలంటే నానా తిప్పలు పడుతున్నారు. ఇక, వయసై పోయిన రైతుల పరిస్థితి మరీ దారుణం. చాలా మం దికి చిన్న ఫోన్లు తప్ప ఆండ్రాయిడ్ ఫోన్లు లేవు. అవి ఉన్న వారికి యాప్లో బుకింగ్ చేసుకోవడం రాదు. దీంతో ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది.
యూరియా కష్టాలు
కాంగ్రెస్ వచ్చిన తర్వాత యూరియా కష్టాలు ఏర్పడ్డాయని రైతులు వాపోతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే ఎటువంటి ఇబ్బంది లేకుండే అని గుర్తు చేసుకుంటున్నారు. యూరియా కష్టాలు ఉండొద్దని రేవంత్ సర్కారు యాప్ను తీసుకొచ్చినా, ఏ మార్పు లేదని చెబుతున్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లో చాలామంది రైతులకు ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోవడం, ఉన్న వారిలో చాలా మందికి దాన్ని పూర్తిగా వాడడం రాకపోవడం, యాప్లు డౌన్లోడ్ చేసుకుని వాడుకునేంత పరిజ్ఞానం లేకపోవడం తదితర కారణాలతో యూరి యా కోసం రైతులకు కష్టాలు తప్పడం లేదు. యాప్, గీప్ ఎందుకు.. పాత పద్ధతిలోనే కావాల్సినంత యూరియాను అందుబాటులో ఉంచితే చాలన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
యాప్ల మన్నువడ..
నాకు దేవునిపల్లిల మూడెకరాల పొలం ఉంది. యూరియా దొరకకపోతే ఇగ పంట పోయినట్లే. అరి పైరు పెరుగదు. యూరియా కొరతతోని మస్తు తిప్పలైతున్నది. ఈ యాప్ల మన్నువడ. దినమంతా ఫోన్ పట్టుకుని కూసుండుడే ఉన్నది. యూరియా బుక్ చేద్దామంటే అయితలేదు. ఐదు నిమిషాలల్లనే స్టాక్ అయిపోతున్నది. ఇదంతా ఏం అర్థమైతలేదు. మునుపటి లెక్కనే యూరియా ఇయ్యాలే.
– సాయిలు, రైతు, దేవునిపల్లి
రైతులను ఘోస పెడుతుండ్రు..
యూరియా దొరుకుతలేదు. మస్తు తిప్పలైతున్నది. ఏదో యాప్ల బుక్ చేసుకోవాలని చెబుతుండ్రు. మాలాంటోళ్లకు గవన్నీ తెల్వదు. తెలిసినోళ్లతోని బుక్ చేపిద్దామంటే అయితలేదు. ఇదంతా కిరికిరిగా ఉంది. ఎప్పటిలెక్క ఇచ్చినట్లే యూరియా ఇయ్యాలె. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంతగానం తిప్పలు లేకుండె. గీ కాంగ్రేస్ సర్కారు అచ్చినంకనే యాప్ అని పెట్టి రైతులను మస్తు ఘోస పెడుతుండ్రు.
– బాలమణి, మహిళా రైతు, కొత్తపల్లి
బుక్ చేయించుకున్న
నాకు ఐఫోన్ ఉండి కూడా ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది. ప్రతిసారీ ఇదే చేయాల్సి వస్తుంది. అన్నీ తెలిసిన నా పరిస్థితే ఇలా ఉంటే, ఫోన్ల గురించి తెలియని రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది? బుక్ చేసుకున్నప్పుడల్లా మూడు లేదా నాలుగు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. అవసరమున్న ప్రతిసారి బుక్ చేసుకునే పరిస్థితుల వల్ల అన్నీ తెలిసిన రైతులకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.
– తీగెల పవన్, రైతు, సుంకెట్
ఎన్నడూ లేని కథలు వెట్టుడేంది..
యూరియా కోసం ఎన్నడూ లేని కథలు వెట్టుడేంది. యాప్ అని పందిక్కులేక పెట్టిండ్రు. యాప్ల ఎట్ల బుక్ జేసుడు, ఏమేం జెయ్యాల ఎట్ల తెల్తది. మళ్ల పిల్లలను అడగాల. వాళ్లతోని బుక్ జేపియ్యాల. గీ కథలన్నెందుకు? పాత లెక్కనే ఇస్తే ఎంత మంచిగుంటది. మస్తుమందికి జెప్తున్న ధర్నా జేస్తేనే మనబాధ ఏంటనేది తెల్తదని.
– కందుల శంకర్, రైతు, ముప్కాల్
పాత పద్ధతిలనే ఇయ్యాల..
యూరియా కావాలంటే యాప్ల బుక్ చేసుకోవాలంట. నాకు స్మార్ట్ఫోన్ సరిగా వాడుడు కూడా రాదు. ఇక యాప్ల యూరియా ఎలా బుక్ చేసుకోవాల? బుక్ చేసేతందుకు తెలిసినోళ్లను బతిమాలాడుతున్న. కొన్నిసార్లు గీ యాప్ సరిగా పనిజేస్తలేదు. ఓటీపీ ఆలస్యంగా వస్తున్నది. నెట్వర్క్ ప్రాబ్లం కూడా మస్తు ఉన్నది.
– దోన్పాల్ భూమన్న, రైతు, తొర్తి
గుళికలు తీసుకోవడం తప్పనిసరి కాదు
ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా తీసుకుంటే గుళికలు తీసుకోవడం తప్పనిసరి కాదు. తీసుకోవాల్సిన అవసరమూ లేదు. సొసైటీల్లో యూరి యా అందుబాటులో ఉంచుతున్నాం. స్టాక్ అయిపోతే ఒక్కరోజులోనే తెప్పిస్తున్నాం. రైతులకు యాప్ గురించి తెలియకపోతే మా సిబ్బందితో, సొసైటీ సిబ్బందితో బుక్ చేయిస్తున్నాం. రైతులకు ఇబ్బందులు ఉన్నాయన్న విషయం మా దృష్టికి రాలేదు.
-లావణ్య, ఏడీఏ, భీమ్గల్