రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ‘బహుజన రాజ్యం కోసం, తెలంగాణపై నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పోరాడిన సర్ధార్ సర్వాయి పాపన్న ఆశయ సాధనకు కృషిచేశాం. కేసీఆర్ ప్రభుత్వంలో గౌడన్నలకు అండగా నిలిచాం. గ్రామీణ ప్రాంతాల్లోని గౌడన్నలకు తాటి, ఈత చెట్ల పన్నులతోపాటు గతంలో ఉన్న బకాయిలన్నింటినీ పూర్తి స్థాయిలో మాఫీ చేశామని’ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలో పర్యటించారు. సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని మొదటి బైపాస్‌రోడ్డులోని నర్సింగ్ కళాశాల చౌరస్తాలో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కులవృత్తిపైనే ఆధారపడిన గౌడన్నల ఉపాధి కోసం మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించామని, నీరా పాలసీ తెచ్చి ట్యాంక్ బండ్ నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచూ ర్యం కల్పించినట్లు చెప్పారు. నీరా వల్ల ఆరోగ్య పరమైన లాభాలుంటాయని ప్రజలకు వివరించి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పిల్లలు చదువుకోవడానికి వందలాది ఎస్సీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి లక్షల మందికి విద్యావకాశాలు కల్పించింది గత కేసీఆర్ ప్రభుత్వమన్నారు. సర్వాయి పాపన్న పోరాట యోధుడని, ఆ మహనీయుడి పేరును జనగామ లేదా రాష్ట్రంలోని మరేదైనా జిల్లాకు నామకరణం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పైన ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. కాగా, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం తొలగి పోవాలని పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో మార్కండేయ ఆలయంలో నిర్వహిస్తున్న చండీయాగానికి హాజరైన కేటీఆర్‌కు పద్మశాలీ సంఘ ప్రతినిధు లు, పురోహితులు ఘనస్వాగతం పలికారు. చండీయాగంలో ప్రత్యే క పూజలు చేసిన ఆయనను పద్మపురోహితులు సన్మానించి, ఆశీర్వదించారు. అనంతరం పలు వివా హ కార్యక్రమాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న సంకల్పంతో చండీయాగం నిర్వహించడం పట్ల పద్మశాలీ సంఘ సభ్యులను అభినందించారు. వస్త్ర పరిశ్రమ సంక్షోభం తొందరగా తొలగి పోయి నేతన్నలు సంక్షేమం వైపు పయనించాలని ఆకాంక్షించారు. శ్రీమార్కండేయ స్వామి ఆలయ నిర్మాణానికి శాసన సభ్యుడిగా తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వం పద్మశాలీ సంఘ భవనానికి స్థలం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో తెలంగాణ సుభిక్షంగా ఉండేలా శ్రీ మార్కండేయుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, పార్టీ నాయకులు బొల్లి రాంమోహన్, గూడూరి ప్రవీణ్, బుర్ర నారాయణగౌడ్, అందె సుభాష్, పద్మశాలీ సంఘం నాయకులు గోలి వెంకటరమణ, మోర రవి, డాక్టర్ గాజుల బాలయ్య పాల్గొన్నారు.