Anganwadi | కోరుట్ల, జూన్ 13: అంగన్ వాడీ కేంద్రాల బలోపేతానికి అంకిత భావంతో కృషి చేయాలని మెట్ పల్లీ ఐసీడీఎస్ సీడీపీవో కాశిపాక మణెమ్మ అన్నారు. పట్టణంలోని రవీంద్ర రోడ్ ఖాజీపురా-2 అంగన్వాడీ కేంద్రంలో అమ్మమాట – అంగన్వాడీ బడి బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లను పెంపొదించాలన్నారు.
ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా పిల్లలకు విద్యా బోధన అందించాలని పేర్కొన్నారు. మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అంగన్ వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం మౌళిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉందన్నారు. కేంద్రాల్లో టాయిలెట్స్, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, ప్రీస్కూల్ మెటీరియల్, యూనిఫామ్స్ అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
అనంతరం ఆమె చిన్నారుల తల్లులకు ఫ్రీస్కూల్ విద్యపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ అలవాల భారతి, అంగన్ వాడీ టీచర్ రాజమణి, ఆయా గంగాభవాని, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.