Free Training | పెద్దపల్లి, జనవరి 28 : ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కరీంనగర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ అందించే ఉచిత శిక్షణను, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్ బండి శ్రీనివాస్ కోరారు. పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న తెలంగాణ స్టేట్ స్టడీ సర్కిల్ కరీంనగర్ బ్రాంచ్‌లో స్టేట్, సెంట్రల్ సర్వీసు ఉద్యోగాలతో పాటు బ్యాంకింగ్, రైల్వే, స్టాఫ్ సెలక్షన్ ఉద్యోగాలకు 5 నెలల ఫౌండేషన్ కోర్స్‌లో 100 మందికి ఉచిత కోచింగ్‌తో పాటు బోజన వసతి కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
గతంలో 928 మందికి శిక్షణ అందించగా, 308 మందికి వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. రూ. 3 లక్షలలోపు వార్షిక ఆదాయం కలిగిన పెద్దపల్లి జిల్లాకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అభ్యర్ధులు అన్లైన్లో http://tsstudycircle.co.in/ (ఎస్సీ స్టడీ సర్కిల్ ) వెబ్ సైట్ ద్వార ఈనెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు వచ్చే నెల 8న కరీంనగర్లో ప్రవేశ పరీక్ష నిర్వహించి 100 మందిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.
ఎస్సీలకు 75 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు. అలాగే మొత్తంలో మహిళలకు 33 శాతం, దివ్యాంగులకు 5శాతం సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఇతర వివరాలకు ఫోన్ నంబర్ 9885218053ను సంప్రదించాలని సూచించారు.