సిరిసిల్ల రూరల్/ సిరిసిల్ల టౌన్/ ఎల్లారెడ్డిపేట, జూన్ 21: సిరిసిల్ల అర్బన్ బ్యాంకు అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 47సహకార బ్యాంకుల్లో సిరిసిల్ల అర్బన్ బ్యాంకును అగ్రగామిగా నిలుపాలని, అందుకు రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని పాలకవర్గానికి సూచించారు. శుక్రవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో అంబేద్కర్ విగ్రహాన్ని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణతో కలిసి ఆవిష్కరించారు. తర్వాత సిరిసిల్లలోని పద్మశాలీ కల్యాణ మండపంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ది-సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు నూతన పాలకవర్గం అభినందన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలందిస్తూ డిపాజిట్లతోపాటు రుణాలు అందించాలని, సంస్థ అభివృద్ధికి అవసరమైన డిపాజిట్ల సేకరణ కో సం ప్రభుత్వ సహకారం తీసుకోవాలని సూచించారు. తాము అధికారంలో లేకున్నా బ్యాంకు అభివృద్ధికి సహకారం అందిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తోపాటు అధికారంలో ఉన్న పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు. సెస్ సంస్థకు సంబంధించిన డిపాజిట్లను అర్బన్ బ్యాంకులో చేసేలా సహకారం తీసుకోవాలన్నారు.
ఎన్నో ప్రత్యేకతలు కలిగిన అర్బన్ బ్యాంకు ఎన్నికలు హోరాహోరీగా సాగాయని, పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల తరహాలో జరిగాయని, ఈ పోటాపోటీ ఎన్నికల్లో గెలుపొందిన వారికి అభినందనలు తెలిపారు. పోటీలో నిలిచి ఓడిన వారు, గెలిచిన వారు సమన్వయంతో పని చేసుకోవాల్సి ఉంటుందన్నారు. రాబోయే నాలుగేండ్లలో కౌన్సిలర్ ఎన్నికలు మినహా వేరే ఏ ఎన్నికలు లేవని, ఎటువంటి పంచాయితీలు లేకుండా బ్యాంకు సిరిసిల్ల పట్టణాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అంతకుముందు బ్యాంకు నూతన చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, పాలకవర్గంతో పాటు సభ్యులందరి సహకారంతో బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. బ్యాంకు డివిడెంట్ల సమస్య పరిష్కారం కోసం రిజర్వ్ బ్యాంకు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఫోన్ పే, గూగుల్ పే సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. భారీ మెజార్టీతో తమకు విజయాన్ని అందించిన ఖాతాదారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే కేటీఆర్ సత్కరించి అభినందనలు తెలిపారు. అంతకుముందు పాలకవర్గ సభ్యులు కేటీఆర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు, ఎంపీపీ పిల్లి రేణుక తదితరులు పాల్గొన్నారు.
దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది? దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరున 12 లక్షలు ఇస్తామని చెప్పింది? కానీ, ఆ హామీ ఏమైంది? ఇప్పటికైనా కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. దళితులను ధనికులుగా చేసేందుకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్ర యత్నం చేశారు. అందులో భాగంగా దళితబంధు పథకం తె చ్చారు. ఇది దమ్మున్న నాయకుడు తీసుకున్న నిర్ణయం. అంబేద్కర్ చేసిన కృషిని గౌరవించుకునేలా సెక్రటేరియట్‌కు ఆయన పేరును పెట్టారు. 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు. దళితుల అభ్యున్నతికి దళితబంధు పథకం ప్రవేశ పెట్టడం వల్ల పదిరలో పెట్రోల్‌బంకు, దుమాల శివారులో విజయలక్ష్మి ఇండస్ట్రీస్ పేరిట రైస్‌మిల్లును ఏర్పాటు చేసుకున్నారు.