Sulthanabad | సుల్తానాబాద్, ఫిబ్రవరి 10 : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపెల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. సుల్తానాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన మున్సిపల్ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆయన మంగళవారం సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రి తీసుకున్నారని ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందితో తగిన ఏర్పాట్లను సైతం చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని, సాయంత్రం ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు కలిగి తరలి వెళ్లారు. ఎన్నికల నిర్వహణలో ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉండరాదని హెచ్చరించారు. అలాగే ఎన్నికల విధుల్లో పోలీస్ సిబ్బందికి ఏసీపీ గజ్జి కృష్ణ పలు సూచనలు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణు, ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీవో దివ్యదర్శనరావు, మున్సిపల్ కమిషనర్ టీ రమేష్, సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.