Vodithela Satishkumar | చిగురుమామిడి, జూలై 14: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో చిగురుమామిడి మండల గ్రామాల వారిగా సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారిగా పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, నాయకుల పనితీరు గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులను అడిగి తెలుసుకున్నారు. .
అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి పనులను మళ్లీ ప్రారంభోత్సవాలు చేపడుతున్నారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ధైర్యంగా ముందుకు వెళ్లాలని పార్టీ చేపట్టిన పనులను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ఇంటింటా గ్రామంలో వివరించాలని నాయకులకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో అంకితభావంతో కంకణ బద్ధులై భారీగా ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవాలని సూచించారు.
ఒకరిద్దరు పార్టీలు మారినప్పటికీ పార్టీకి నష్టం లేదని అన్నారు. అందరికీ తానున్నానని, పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపారు. కలిసికట్టుగా, సమిష్టిగా పనిచేస్తే విజయం మనదే అని అన్నారు. గ్రామాల వారీగా వచ్చే నెలలో పర్యటిస్తారని కార్యకర్తలకు సూచించారు. గ్రామాల్లో పార్టీ పనితీరు, కార్యకర్తల మనోభావాలను, చేపట్టాల్సిన వ్యూహాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సమీక్షా సమావేశంలో జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, మండల నాయకులు పెనుకుల తిరుపతి, రామోజు కృష్ణమాచారి, మండలానికి చెందిన నాయకులతోపాటు అన్ని గ్రామాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ మంచి నాయకుడిని కోల్పోయింది..
బీఆర్ఎస్ మంచి నాయకుడిని కోల్పోయిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు సింగిల్ విండో మాజీ చైర్మన్ గంప వీరయ్య ఇటీవల మృతిచెందాడు. కాగా వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పార్టీతో వారికున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
వారి కుమారులు గంప చంద్రశేఖర్, మదన్మోహన్, రాజును మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీరి వెంట జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు కొంకట రవీందర్, గ్రామ శాఖ అధ్యక్షుడు కత్తుల రమేష్, మాజీ ఎంపీటీసీ మిట్టపల్లి మల్లేశం, మండల నాయకులు దుడ్డేల లక్ష్మీనారాయణ, పెండల సదానందం, తదితరులు ఉన్నారు.