గంగాధర, జూలై 25 : ఈ ఇద్దరు మహిళలే కాదు, పేదవారి సొంతింటి కలను నిజం చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలకు అందని ద్రాక్షగానే మిగిలింది. అర్హులను వదిలి పెట్టి అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికి ఇండ్లు కేటాయించారని, అన్ని అర్హతలు ఉన్న తమ పేర్లు మొదటి జాబితాలో లేకపోవడంతో మాకేది ఇందిరమ్మ ఇల్లు అని అధికారులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా పైలట్ గ్రామం కురిక్యాలలో మొదటి విడుతగా 208 ఇండ్లు కేటాయించగా, 115 మంది ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపలేదు. అలాగే, మిగిలిన 32 గ్రామాల్లో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ప్రకారం రెండో విడుతలో 711 ఇండ్లను కేటాయించగా 39 మంది ఇమకు ఇండ్లు వద్దన్నారు. దీంతో మండలంలో 154 ఇండ్లు నిరుపయోగంగా మారాయి. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల్లో అధికార పార్టీ నాయకులే ఉండడం, వారు సూచించిన వారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడంతో అర్హులైన వారికి ఇండ్లు అందకుండా పోయాయని, భూములు జాగలు ఉన్న వారు, ఇప్పటికే ఇండ్లు ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు విచారణ చేసి అరులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని కోరుతున్నారు.
పైఅధికారుల దృష్టికి తీసుకువెళ్లి గ్రామాల్లో అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందేలా చూస్తాం. ఇందిరమ్మ కమిటీలు సూచించిన వారికే మొదటి విడుత ఇండ్లు కేటాయించాం. మండలంలోని 154 మంది ఇండ్లు నిర్మించుకోవడానికి ఆసక్తి చూపలేదు. దీంతో వారి నుంచి లిఖిత పూర్వకంగా లేటర్ తీసుకున్నాం. పైఅధికారుల దృష్టికి తీసుకు వెళ్లి 154 ఇండ్లను మండలంలో అర్హులైన వారికి కేటాయిస్తాం.
-రాము, ఎంపీడీవో
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ గంగాధర మండలం ఆచంపల్లి గ్రామానికి చెందిన చింతకింది భారతమ్మ. భారతమ్మ కూలి పనులు చేస్తుండగా, భర్త మల్లేశం చిన్నాచంపల్లిలో పారిశుధ్య కార్మికుడు. వీరు ఉండే పాత ఇల్లు శిథిలావస్థకు చేరుకోగా పక్కనున్న గోడపై రేకులు వేసుకుని జీవిస్తున్నారు. వీరికి ఇల్లు తప్ప మరే ఆస్తులు లేవు. గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటికి కోసం దరఖాస్తు చేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి వచ్చి ఫొటోలు తీసుకుని ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పారు. అధికారులు విడుదల చేసిన జాబితాలో భారతమ్మ పేరు కనిపించలేదు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ గంగాధర మండలం ఆచంపల్లి గ్రామానికి చెందిన ఎడపెల్లి పుష్ప. ఆమె కూలి పనులు చేస్తుండగా, భర్త చంద్రయ్య పారిశుధ్య కార్మికుడిగా పని చేసి వృద్ధాప్యం వల్ల ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. వీరు గ్రామంలో 20 ఏళ్లుగా చిన్న రేకుల ఇంటిలో ఉంటున్నారు. వర్షాకాలంలో వానకు రేకులు ఉరిసి ఇంట్లోని వస్తువులు తడిసి ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటికి కోసం దరఖాస్తు చేసుకోగా, పంచాయతీ కార్యదర్శితో పాటు మరో ప్రత్యేకాధికారి వచ్చి వివరాలు సేకరించారు. ఫొటోలు తీసుకుని ఇందిరమ్మ ఇల్లు వస్తుందని చెప్పారు. అధికారులు విడుదల చేసిన జాబితాలో పుష్ప పేరు లేదు.