Function hall | కోల్ సిటీ, జూలై 8: సరైన ధ్రువపత్రాల అనుమతితోనే లక్ష్మీ నరసింహా ఫంక్షన్ హాలు నిర్మించామని యజమాని చింతలపల్లి కిషన్ రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని కృష్ణానగర్ లో నర్రశాలపల్లికి వెళ్లే దారిలో ఉన్న తమ ఫంక్షన్ హాలుపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు. కొద్ది రోజులుగా కొందరు దురాశతో కావాలనే తమపై లేనిపోని ఆరోపణలు, అసత్యపు ప్రచారాలు చేస్తున్నారన్నారు.
ఫంక్షన్ హాలు వద్ద వాహనాల పార్కింగ్ కు సంబంధించి ప్రహరీ నిర్మాణంను నగర పాలక సంస్థ అధికారులు జారీ చేసిన నోటీసులకు కట్టుబడి తామే హుందాగా వ్యవహరించి స్వచ్ఛందంగా ప్రహరీని తొలగించామని పేర్కొన్నారు. ఫంక్షన్ హాలుకు అన్ని అనుమతులు ఉన్నాయనీ. కానీ తామంటే గిట్టనివారు నగర పాలక సంస్థ కార్యాలయంలో తప్పుడు ఫిర్యాదులు చేస్తూ తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తమ పరువుకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.