Peddapally | పెద్దపల్లి, జూలై 16: జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నామని మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అధ్యక్షతన నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సంబురాల సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతో కలిసి ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఐదేండ్ల కాలంలో లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 26 వేల కోట్లు మహిళలకు వడ్డీలేని రుణాలు మంజూరు చేశామని పేర్కొన్నారు. మహిళలను వ్యాపార వాణిజ్యవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. అనాథలైన 15 ఏళ్లు దాటిన బాలికలకు, 60 ఏళ్లు దాటిన వృద్దురాళ్లకు మహిళా శక్తి సంఘాల్లో సభ్యత్వం ఇవ్వాలని సూచించారు.
దసరా వరకు మహిళలకు చీరల పంపిణీ చేస్తామని చెప్పారు. మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీ సంస్థకు అద్దె బస్సులు, పెట్రోల్ పంప్, ధాన్యం కొనుగోలు, రైస్ మిల్ వంటి అనేక వ్యాపారాలను ఏర్పాటు చేయిస్తున్నామని చెప్పారు. మహిళా సంఘం సభ్యులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షలు, సాధారణంగా మరణిస్తే రూ. 2 లక్షల వరకు లోన్ మాఫీ అవుతుందని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రమాదవశాత్తు మరిణించిన నలుగురి కుటంబాలకు రూ.10 లక్షల చొప్పున చెక్కులు అందించామని వెల్లడించారు.
మహిళలందురు ఐక్యంగా ఉండి ఆర్ధికంగా ఎదిగి, వ్యాపారవేత్తలుగా రాణించాలని ఆకాంక్షించారు. వ్యవసాయ శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ, జిల్లాలో ఆయిల్ పాం సాగును మరింత పెంచాలని, వరి, మిర్చి, పత్తి సాగును తగ్గించాలని సూచించారు. ఆయిల్ పాం టన్నుకు రూ. 25వేలు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పెద్దపల్లి తిరుమాల జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెద్దరాతిపల్లిలో తిరుమల పామాయిల్ ఫ్యాక్టరీ త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో నెల రోజుల్లో వీ హాబ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 1 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గోదావరి, కృష్ణ నది జలాలను మన వాటా ప్రకారం తీసుకొని తీరుతామని స్పష్టం చేశారు.బనకచర్లను ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. గోదావరి నది పరిహార ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చాకే మిగిలిన జలాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తామన్నారు.
రూ. 23.05 కోట్ల బ్యాంక్ లింకేజీ చెక్కు ల అందజేత
పెద్దపల్లి నియోజక వర్గంలోని మహిళా సంఘాలకు రూ. 23. 05 కోట్ల బ్యాంక్ లింకేజీ వడ్డీలేని రుణాల చెక్కులను మహిళా సంఘాలకు మంత్రులు అందజేశారు. జిల్లాలోని మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ సంస్థకు పెట్టిన 9 అద్దె బస్సులు ప్రారంభించారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు దాసరి వేణు, జల్ద అరుణ శ్రీ, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఈర్ల స్వరూప, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.