MLA Satyanarayana | తిమ్మాపూర్, జూన్7: పేదలందరికీ పక్కా ఇండ్లు ఉండాలని సంకల్పంతో నాడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని.. ఆమెను ఆదర్శంగా తీసుకొని నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీ పేదవారికి ఇల్లు ఉండాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్ లో తిమ్మాపూర్ మండలంలోని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామని, ఏ పథకం ఇచ్చినా మహిళలకు మెజారిటీగా ఇస్తున్నామన్నారు. మహిళల పేరు మీద ఇస్తున్నామని, మహిళలకు అనేక పథకాలను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో లక్ష రుణం ఇప్పిస్తున్నామని చెప్పారు. మంజూరైన వారు తప్పకుండా నిర్మించుకోవాలని సూచించారు. హౌసింగ్ పీడీ గంగాధర్ లబ్ధిదారులకు విధివిధానాలు వివరించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉన్నప్పుడే ముగ్గు పోయాలని స్పష్టం చేశారు. 400 నుండి 600 గజాల మధ్యలోనే పోయాలని, పాత ఇంటిని ఆనుకొని కట్టవద్దని, ప్రభుత్వం చెప్పిన విధానంగానే తప్పనిసరిగా నిర్మించాలన్నారు.
ఏమాత్రం మార్పులు చేసిన నిధులు విడుదల కావని స్పష్టం చేశారు. బేస్మెంట్ అయ్యాక రూ.లక్ష, గోడలయ్యాక రూ.లక్ష, స్లాబ్ పోశాక రెండు లక్షలు, మొత్తం ఇల్లు పూర్తయ్యాక రూ.లక్ష వస్తాయన్నారు. మొత్తం మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కర్ర శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి రమేష్, నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు, ఎస్ ఎల్ గౌడ్, కొత్త తిరుపతిరెడ్డి, మాచర్ల అంజయ్య, దావు సంపత్ రెడ్డి, పోలు రమేష్ రాము, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
పలువురి అసంతృప్తి..
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గెలుపు కోసం కష్టకాలంలో దెబ్బలు తిని కష్టపడ్డ అర్హులైన తమకు ఇండ్లు రాలేదని పలువురు కార్యకర్తలు, లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల ముఖ్య నాయకులతో గొడవకు దిగారు. మరో విడతలో వస్తుందని నాయకులు వారికి నచ్చజెప్పారు. గ్రామాల్లో ఆర్థికంగా ఉన్నవారికే ఇండ్లు మంజూరయ్యాయని, అర్హులమైనా తమకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.