గోదావరిఖని/అంతర్గాం, మే 3: స్వరాష్ట్రంలో రామగుండం నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో తీర్చిదిద్దుతున్నామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. అంతర్గాంలో ఇండస్ట్రియల్, రామగుండంలో ఐటీ పార్కుల శంకుస్థాపన, పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి 8న కేటీఆర్ గోదావరిఖనికి వస్తున్నారని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఖనిలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన సమీపంలో ఐటీ పార్కు, అంతర్గాంలో ఇండస్ట్రియల్ పార్కుల శంకుస్థాపనకు స్థల పరిశీలన చేశారు. గోదావరిఖనిలో జేఎల్ఎన్ స్టేడియంలో భారీ బహిరంగ సభ తలపెట్టగా, ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయాచోట్ల ఎమ్మెల్యే మాట్లాడారు. రామగుండం నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రగతి పథంలో దూసుకెళ్తున్నదని, సీఎం కేసీఆర్ సారథ్యంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నామని, అందులో భాగంగానే ఇండస్ట్రియల్, ఐటీ పార్కులు తీసుకువస్తున్నామని వివరించారు. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఆయన వెంట మేయర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కారొరేటర్లు దొంత శ్రీనివాస్, కొమ్ము వేణు, రాజ్‌కుమార్, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ, సర్పంచ్ వెంకటమ్మ నూకరాజు, మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయక్, కోల సంతోష్, నాయకులు మారుతి, పర్లపల్లి రవి, శంకర్ గౌడ్, జేవి రాజు, రవీందర్, చెల్కలపల్లి శ్రీనివాస్, మురళీధర్‌రావు, తదితరులు ఉన్నారు.