Godavarikhani | కోల్ సిటీ, జూలై 2: రామగుండం నగర పాలక సంస్థ 33వ డివిజన్లో ప్రజా పోరాటాల ఫలితంగానే రోడ్డు సాధించుకున్నామని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ పేర్కొన్నారు. ఈమేరకు డివిజన్లో నూతన రోడ్డు పనులను నగర పాలక సంస్థ ఎస్ఈ శివానంద్ బుధవారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణం త్వరితగతిన నాణ్యతతో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని సందర్భంగా దినేష్ ఆయనను కోరారు.
దినేష్ మాట్లాడుతూ గతంలో రోడ్డు నిర్మాణం జరగాలంటే ఇండ్లు తొలగించాల్సి వస్తుందని అధికారులు మార్కింగ్ ఇచ్చారని, 23 ఫీట్ల వెడల్పు కారణంగా ఆస్తి నష్టం జరుగతుందని, ఇదే విషయమై తాము డివిజన్ ప్రజలతో కలిసి పోరాటాలు చేపట్టామన్నారు. అదే విషయాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీ, ఇంజనీరింగ్ అధికారుల దృష్టికి తీసుకవెళ్లగా స్పందించి 18 పీట్లకు కుదించి స్థానిక ప్రజల ఇళ్లకు నష్టం జరగకుండా నూతన రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
అలాగే డివిజన్ ప్రజల సౌకర్యార్థం ఒక పార్కుతోపాటు వీధి లైట్లు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. డివిజన్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.