కోనరావుపేట, సెప్టెంబర్ 19 : ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రైతన్నలకు యూరియా కూడా అందించలేక దిక్కుమాలిన పాలన చేస్తున్నదని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ధ్వజమెత్తారు. అధికారంలోకి రావడానికి అలవిగాని హామీలిచ్చి.. నేటికీ ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయడంలేదని మండిపడ్డారు. మల్కపేట రిజర్వాయర్‌లో నీళ్లు నింపాలని తాము ప్రెస్‌మీట్ పెడితేనే.. తెల్లవారుజామునే విడుదల చేశారన్నారు. పదవులపై వ్యామోహంతో ఒకరిద్దరు పార్టీని వీడినంత మాత్రాన ఒరిగేదేమీలేదని, ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగానే ఉన్నదని స్పష్టం చేశారు. ఈ మేరకు కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం కానున్నదని తెలిపారు.
ఇప్పటికే ప్రతి గ్రామంలో కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిందన్నారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులపై కార్యకర్తలు గ్రామాల్లో చర్చించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. అలాంటి ప్రాజెక్టు కూలిపోయిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరమే లేకుంటే మల్కపేట రిజర్వాయర్ ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మడం లేదని మండిపడ్డారు. గ్రామాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఫ్లెక్సీలు కడితే ఓర్వలేక అధికారులతో వాటిని తొలగించడం సిగ్గుచేటన్నారు. కానీ, ప్రజల గుండెల్లో కేసీఆర్ నిలిచిపోయారని, ఆయన ముద్రను ఎవరూ చెరిపివేయలేరన్నారు. ఇది చేశాం.. అది చేస్తున్నామంటూ.. ఇక్కడి నాయకులు ప్రలోభాలు పలుకడం తప్ప.. చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ సంకినేని రామ్మోహన్రావు, పార్టీ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, నాయకులు రాఘవరెడ్డి, పరశురాములు, చంద్రయ్య, జీవన్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు.